- కొత్త సిఇఒ ప్రణాళికలు
న్యూఢిల్లీ : కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తీవ్ర ఆర్థిక కటకటను ఎదుర్కొంటుంది. పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగులను తొలగించిన బైజూస్ మరోమారు వేలాది మంది సిబ్బందిని ఇంటికి పంపించే యోచనలో ఉందని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. బైజూస్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) అర్జున్ మోహన్ నియామకం తర్వాత కొత్త ప్రణాళికలు వేస్తున్నారని సమాచారం. దాదాపుగా 4000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం ఆయన కంపెనీలోని సీనియర్ ఉద్యోగులకు తెలియజేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. సంస్థ సామర్ధ్యం అంచనాలను అందుకోలేని ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులపైనా వేటు పడొచ్చు. సీనియర్ మేనేజ్‌మెంట్‌పై వెచ్చిస్తున్న ఖర్చును తగ్గించుకునే క్రమంలో ఆ విభాగం వారిపై ఎక్కువ ప్రభావం ఉండనుందని తెలుస్తోంది. ఫలితంగా ఉద్యోగుల వేతనాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని తగ్గించుకోవాలన్నది కీలక ప్రణాళిక. అలాగే వివిధ విభాగాలను విలీనం చేసి అన్నింటినీ బైజూస్ కిందకే తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లోనే సంస్థ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విభాగాల్లోనూ ఒకే సిబ్బందిని ఉంచాలని యోచిస్తోంది. దీంతో అదనంగా ఉన్నవారిని బయటకు పంపనున్నారు. కరోనా సమయం 2021లో బైజూస్‌లో 52వేల మంది పని చేయగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 35వేలకు తగ్గిందని అంచనా.. భవిష్యత్తులో మరింత మందికి ఉద్వాసనలు పలకడంతో సిబ్బంది సంఖ్య ఎంతకు చేరనుందో వేచి చూడాలి.