- రవీంద్రన్ నివాసం, ఆఫీసుల్లో ఇడి సోదాలు
న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ విదేశీ నిధులు ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆ సంస్థపై దాడులు ప్రారంభించింది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ బైజు, ఆయన కంపెనీ థింక్ అండ్ లెర్న్ కార్యాలయాల్లో ఫెమా చట్టం కింద శనివారం అధికారులు సోదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టార్టప్ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసి ఇడి దర్యాప్తు చేస్తోంది. మొత్తంగా రవీంద్రన్‌కు సంబంధించిన మూడు ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బైజూస్ 2011 నుంచి 2023 మధ్య దాదాపు రూ.28 వేల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు అందుకుందని తమ తనిఖీల్లో తేలిందని ఇడి వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో పెట్టుబడుల పేరుతో రూ.9,754 కోట్ల నిధులను విదేశాలకు బదిలీ చేసినట్లు తెలిపింది. ఇందులో అవకతవకలు జరిగాయని ఇడి వర్గాలు పేర్కొన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలను వెల్లడించలేదని, ఖాతాలను ఆడిటింగ్ చేయించలేదని తెలిపాయి. దీనిపై పలుమార్లు రవీంద్రన్‌కు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదని ఇడి వర్గాలు తెలిపాయి.










