- ధర 150 శాతం పెరగొచ్చు : క్రిసిల్ రిపోర్ట్
న్యూఢిల్లీ : ఇప్పటికే రాఠెత్తిన టమాటా ధరలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుండగా... ఇక ఉల్లి కూడా కొండెక్కి కూచోనుందని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం ఎగిసి కిలో రూ.60-70కి చేరవచ్చని క్రిసిల్ వెల్లడించింది. సరఫరాలో మరిన్ని లోపాలు తలెత్తితో మరింత ధర పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. వచ్చే పండగ సీజన్‌లో ఉల్లి ధరలు కూడా ప్రస్తుత టమాటా బాట పట్టనున్నాయని తెలిపింది. క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి, మార్చిలో అధికంగా అమ్మకాలు నమోదయ్యాయి. గత రబీ సీజన్‌లోని ఉల్లి నిల్వలు సెప్టెంబర్ కంటేముందే.. అంటే ఆగస్టు నాటికే గణనీయంగా పడిపోవచ్చు. దీంతో సెప్టెంబరు నాటికి సరఫరాలు తగ్గి.. ధరలు పెరగొచ్చు. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు సుమారు రూ.30గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.20-25 మధ్య పలుకుతోంది. అక్టోబరు నుంచి ఖరీఫ్ పంట లభ్యత పెరిగితే ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టొచ్చని క్రిసిల్ పేర్కొంది. అక్టోబర్- డిసెంబర్ ధరల్లో కొంత స్థిరత్వం రావొచ్చని అంచనా వేసింది.










