Aug 23,2023 08:39

టింకూకి పదేళ్ళుంటాయి. కుక్కపిల్లలంటే ఇష్టపడుతున్నాడని తన స్నేహితురాలిని అడిగి వాళ్లింట్లో ఉన్న ఓ బుజ్జి కుక్క పిల్లను పెంచుకోవడానికి తెచ్చింది వాళ్ళమ్మ. టింకూ తెగ సంబరపడిపోయాడు. ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసి దాని ముందుంచాడు. అది పాలు తాగి ఆడుతుంటే గంతులు వేశాడు. ఒక రోజు టింకూ బ్రెడ్‌ పళ్ళెంలో పెట్టి అదే పళ్ళెంలో పాలగ్లాసు పెట్టుకుని తిందామని బల్లపై పెట్టాడు. ఇంతలో వాడి చెయ్యి తగిలి గ్లాసులో పాలు పళ్ళెంలో ఒలికిపోయాయి. బుజ్జి కుక్కపిల్ల చూస్తుండగానే పాలు క్షణంలో మాయమయ్యాయి. బ్రెడ్‌ ఆ పాలను తాగేసిందని అది గ్రహించింది. దాని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
         పాలు తాగిన ఆ బ్రెడ్‌ తనలాగానే ఒక ప్రాణి అని భావించింది. 'కాకపోతే అది తనలా చలాకీగా కాకుండా, కదలకుండా బద్దకంగా పడి ఉంది. అంత సోమరితనంలోనూ గ్లాసుడు పాలూ క్షణంలో తాగేసింద'ని ఆశ్చర్యపోయింది. ఆ బ్రెడ్‌ ముక్కని పలకరించుదామనే లోపు టింకూ వచ్చి చెంచాతో బ్రెడ్‌ తినేశాడు. బుజ్జి కుక్క తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. పాలు తాగిన బ్రెడ్‌ని తిన్న టింకూని చూసి భయంతో వణికిపోయింది. పాలు తాగే తననీ టింకూ అలాగే తినేస్తాడేమో అనే ఊహతో ఇక అది పాలు తాగడమే మానుకుంది.
       ఆ రోజు నుండి టింకూతో అదివరకులా ఆడుకోవడం లేదు. దాని కంటికి టింకూ రాక్షసుడిలా కనబడసాగాడు. వచ్చిన మూడు రోజులకే చలాకీతనం కోల్పోయి ఏం తాగకుండా, ఆడుకోకుండా ముడుచుకుపోయి వణుకుతున్న బుజ్జి కుక్కని చూసిన టింకూ వాళ్ళమ్మకి అది తల్లి బెంగో, అనారోగ్యమో అర్థం కాలేదు. ఎంత బుజ్జగించినా పాలు తాగకపోవడంతో చేసేదేం లేక తిరిగి స్నేహితురాలింట్లో వదిలివేసింది. అక్కడ తల్లి దగ్గర చేరి మళ్ళీ హాయిగా ఆడుకుంటున్న బుజ్జి కుక్కపిల్లను చూసి బెంగ అనే అనుకున్నారు, అసలు సంగతి తెలియని స్నేహితురాళ్ళిద్దరూ.
- గుడిపూడి రాధికారాణి