Oct 04,2022 08:03
  • ఈ ఖరీఫ్‌ నుంచి కొత్త విధానం
  • ప్రొక్యూర్‌మెంట్‌ రూట్‌ అసిస్టెంట్లుగా వలంటీర్లు
  • నూతన సేకరణ విధానంపై త్వరలో ఉత్తర్వులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రభుత్వం మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఖరీఫ్‌లో వేసిన ధాన్యాన్ని నూతన విధానంలో సేకరించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సాంకేతిక సేవలను వినియోగించుకోవడం ద్వారా అక్రమాలకు, మిల్లర్ల జోక్యానికి కళ్లెం వేయడానికి ఈ పద్ధతిని ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా ధాన్యం సేకరణకు కొత్త రకం యాప్‌ను రూపొందిస్తోంది. జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. నూతన సేకరణ విధానంపై వారికి సమాచారమిచ్చారు. త్వరలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు రానున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో 2022-23 ఖరీఫ్‌ సీజన్‌లో 38.98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు 34.58 లక్షల ఎకరాల్లో సాగైంది. కొన్ని జిల్లాల్లో వరి పంట సాగు చివరి దశలో ఉన్న నేపథ్యంలో అధికారులు ధాన్యం సేకరణకు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రస్తుత సీజన్లో సాగైన వరి దిగుబడి వివరాలను వ్యవసాయ శాఖాధికారుల నుంచి సేకరిస్తున్నారు. అందుకను గుణంగా కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించనున్నారు. దీనికంటే ముందు ధాన్యం సేకరణ ఈ ఏడాది ఎలా చేయాలన్న అంశంపై ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేశారు. నూతన విధానంలో ధాన్యం సేకరణకు ప్రాథమికంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. పూర్తిగా మొబైల్‌ యాప్‌ ఆధారిత సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. రైతుల కళ్లాల వద్దకే ప్రొక్యూర్‌మెంట్‌ సిబ్బంది వెళ్లి ధాన్యాన్ని పరీక్షించి కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ఆధునాతన పరికరాలు అందజేయనున్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకనుగుణంగా నాణ్యత పరీక్షలను సిబ్బంది చేస్తారు.

                                                                     రూట్‌ అసిస్టెంట్లుగా వలంటీర్లు

ధాన్యం సేకరణలో పనిచేసే సాంకేతిక సిబ్బందికి ప్రొక్యూర్‌మెంట్‌ అసిస్టెంట్‌గా వలంటీరును ఎంపిక చేసి సంబంధిత ఆర్‌బికెలో విధులు కేటాయించనున్నారు. కళ్లాల్లో ధాన్యం పరీక్షించిన సమయం, వేయింగ్‌ బ్రిడ్జి వద్ద తూకం, మిల్లుకు అప్పగింత సందర్భాల్లో కస్టోడియన్‌ ఆఫీసర్ల (విఆర్‌ఒల)తో సమన్వయం చేసుకుని రూట్‌ అసిస్టెంట్‌గా వలంటీర్లు పనిచేయాలి. ఈ విధులు నిర్వహించిన కాలానికి నెలకు రూ.1500 చొప్పున పారితోషికాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.
 

                                                          ధాన్యం సేకరణ భారం తగ్గించుకునేందుకేనా ?

ధాన్యం సేకరణలో అక్రమాలు, మిల్లర్ల పాత్రను నిలువరిం చేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నా, రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ధాన్యం పరీక్షించిన సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు కచ్చితంగా ఉంటేనే సిబ్బంది తీసుకుంటారు. తేమ, పొల్లు ఉంటే మళ్లీ తీసుకురావాలని తిరస్కరించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొనుగోలుకు వినియోగిస్తున్న యాప్‌తో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలూ లేకపోలేదు. కళ్లం, వేయింగ్‌ బ్రిడ్జి, మిల్లు గేటు ఇలా ఏ ఒక్క ప్రాంతంలోనైనా సిగల్స్‌ లేకపోతే ఆ ప్రక్రియ ఆగిపోతుంది. ధాన్యం కొనుగోలుకు తీసుకొస్తున్న కొత్త విధానం ప్రయివేట్‌, దళారులకు ఉపయోగ పడేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం సేకరణలో కఠిన నిబంధ నలు విధించడం ద్వారా సేకరణ భారం తగ్గి ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.

                                                      యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ అయితేనే చెల్లింపులు

ధాన్యం సేకరణకు పిఎసిఎస్‌ల ద్వారా సాంకేతిక సిబ్బందిని సమకూర్చనున్నారు. వారు కొత్త యాప్‌లో ధాన్యాన్ని పరీక్షించిన ఫొటో, వేయింగ్‌ బ్రిడ్జి, మిల్లు గేటు వద్ద ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు సందర్భాల్లో తీసిన ఫొటోలు అప్‌లోడ్‌ అయితేనే ఆ ప్రక్రియ పూర్తయినట్లు లెక్క. అప్పుడే రైతులకు డబ్బులు చెల్లించనున్నారు. యాప్‌లో అప్‌లోడ్‌ చేసే విధానంపై త్వరలో సిబ్బందికి శిక్షణ ఇవ్వ నున్నారు. జిల్లాలో ఉన్న అన్ని వేయింగ్‌ బ్రిడ్జి లనూ కలెక్టర్‌ ఆధీనంలోకి తీసుకురానున్నారు.