Aug 28,2023 10:12

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని సెంట్రల్‌ పార్కుకు ఎదురుగా ప్రతిష్టాత్మంగా నిర్మించిన బస్‌ బే ప్రారంభం కాకుండానే కూలిపోయింది. విశాఖ నగరం మరింత సుందరంగా కనబడడం కోసం సరికొత్త డిజైన్‌తో బస్‌ బేలను ప్రభుత్వం నిర్మిస్తోంది. అందులో భాగంగా రూ.40 లక్షలతో సెంట్రల్‌ పార్కునకు ఎదురుగా నిర్మించిన బస్‌ బే మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కావాల్సి ఉండగా ఆదివారం ఉదయం కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రాంతంలో మార్నింగ్‌ వాక్‌ కోసం వచ్చిన వారు ఆ సంఘటనను చూసి ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
 

                                                                     సిపిఎం, జనసేన నిరసన

బస్‌ బే కూలిపోయిన సంఘటనను ఖండిస్తూ, అదే స్థలంలో సిపిఎం, జనసేన కార్పొరేటర్లు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ బస్‌ బేల పేరిట రూ.3 కోట్లను అధికార పార్టీ నాయకులు జేబులో వేసుకున్నారని విమర్శించారు. ఎటువంటి నాణ్యతా లేకుండా, ఆధునీకీకరణ పేరిట విశాఖ నగర పరిధిలో 20 చోట్ల బస్‌ బేలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా జివిఎంసిలోని నలుగురి లబ్ధి కోసం ఇటువంటి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు.