ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బాపట్లలో ఆర్‌టిసి స్థలంలో రాజకీయపార్టీ కార్యాలయం ఏర్పాటు అంశంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకున్న డిపోమేనేజర్ శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడం అక్రమమని, తక్షణం ఈ అక్రమ బదిలీని ఆపాలని ఎపిపిటిడి(ఆర్‌టిసి) స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్‌డబ్ల్యుఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌కె జిలాని భాష, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య, ప్రధానకార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, ప్రచారకార్యదర్శి టిపిఆర్ దొరలు ఒక ప్రకటన విడుదల చేశారు. డిపో మేనేజర్ శ్రీనివాసరెడ్డి ఆర్‌టిసి స్థలం అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని బాద్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. శ్రీనివాసరెడ్డి అక్రమ బదిలీని తక్షణం రద్దుచేసి బాపట్లలోనే విధులను నిర్వర్తించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఆర్‌టిసి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.










