- అనుమతులు తక్కువ.. తయారీ ఎక్కువ
- అదే ప్రమాదానికి మూలకారణం ?
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం రూరల్, అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన అన్నవరం సుమారు ఐదేళ్ల క్రితం కడియద్ద గ్రామంలో బాణసంచా తయారీ పరిశ్రమకు అనుమతులు తీసుకున్నాడు. 15 కిలోల వరకు పొటాషియం దిగుమతి చేసుకునేందుకు అధికారులు అనుమతులిచ్చారు. ఇటీవల పలు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా రావడంతో తయారీదారుడు నిబంధనలు తుంగలో తొక్కాడని, 24 టన్నుల పొటాషియంతోపాటు పేలుడుకు సంబంధించిన ఇతర సామగ్రిని ఇటీవల దిగుమతి చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. పరిమితికి మించి మందుగుండు నిల్వలను దిగుమతి చేసుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం, నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు, దీనికి తోడు తాటాకులతో గుడిసెలు వేసి అందులో కూలీలు పని చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అనుమతులకు మించి పొటాషియం దిగుమతి చేసుకోవడం, ఒత్తిడి అధికమవ్వడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేసుకున్నారు. ప్రమాద స్థలికి అగ్నిమాపక శకటం చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో దూరంగా వాహనాన్ని నిలిపివేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పక్కనే ఉన్న చెరువులో ఇంజన్‌ను ఏర్పాటు చేసి ఆ నీటితో మంటలను అదుపు చేశారు.
అగ్నికీలలు, మరోవైపు పేలుడు శబ్దాలు వినిపిస్తుండడంతో గంట వరకు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆ తర్వాతే కడియద్దతో పాటు, చుట్టు పక్కల గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహకారం అందించారు.
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
పేలుడు దాడికి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన యాళ్ల ప్రసాద్, రొయ్యల స్వామి, నాగిరెడ్డి నాని అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాల పాలైన నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన రాజు చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. పేలుడు ధాటికి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉండొచ్చని తొలుత భావించారు.
గవర్నర్ దిగ్బ్రాంతి
బాణాసంచా తయారీ యూనిట్‌లో గురువారం జరిగిన పేలుడు ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన వివరాలను రాజ్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా ద్వారా తెలుసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు గవర్నర్‌కు జిల్లా యంత్రాంగం సమాచారం తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు.










