Nov 21,2022 07:53

బ్రేకప్‌.. అన్న ఒక్క మాటతో
సరస సంభాషణలు ఎప్పుడో తెగిపడ్డాయి
ఆశించినంత రమణీయంగా లేదు
అలాగని అనుకోనంత వికర్షణ లేదు
తావిని వీడిన పువ్వులా నిస్సారంగానూ గాక
మలయ మారుతంలా హాయిగానూ లేదు..
నిన్ను వదులుకున్నాక జీవితం నిండా
అరమరికలు లేని అసహజాలే వూపిరంతా
పోనీ నువ్వున్నప్పుడైనా ప్రశాంతంగా వున్నానా?
ప్రతి జ్ఞాపకం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది..
ఆకాశంలో చంద్రుడు నిండుగా పూచినా
గుండె మీద దొర్లుతున్న అనుభవాల్ని తుడవలేక
వెన్నెల కాయని రాత్రులు ఎన్ని అనుభవించానో..?
నీకూ నాకు మధ్య కనిపించని ఆ గోడ ఒక్కటే కదా
మన మధ్య యిన్ని అనర్ధాల మూల కారణం..
ప్రేమది ఒక దివ్య భాష
దానిదంతా ఓ మార్మిక కరచాలనం..
నువ్వయినా సుఖంగా వుండాలని కోరుకున్నాను
పువ్వు లేని తావి గాలికి కూడ చులకనే
జీవితాన్ని ఏ తీరాలకు యీడ్చుకు వెళుతుందో
ఆ ఒడ్డున ఒక సూర్యుడు ఉదయిస్తాడో
ఉదయించిన సూర్యుడిలాగే ఒక ఆశ పూస్తుందో
వైవాహిక జీవనం అంతుచిక్కని వైకుంఠ పాళీ కదా..!
ఎప్పుడు వెలుగుని చీకటి మింగేస్తుందో
మబ్బులు వీడిపోయి ఏ క్షణం నింగి తేటపడుతుందో
నాకు నేను వేసుకున్న అనేకానేక ప్రశ్నల మధ్య
సమాధానాల మైలు రాళ్ళు వుంటాయా..?
నీవు,నేనూ రాజీపడలేని అడుగు దూరంలో
వొంటరొంటరిగానే నడక సాగించాలా..?
ఎంతదూరం యీ నిశిరాత్రి ఎడారి ప్రయాణం..?
శాంతికీ, కాంతికీ ఎడబాటై విచిత్ర భ్రాంతిలో
జీవితానికి నిర్వచనం సర్దుబాటు అనే స్ప ృహ మరచి
బతుకు అంచుమీద ఏకాంతాన్ని నాటుకోవటమేనా చివరి వరకు...?
పెళ్ళంటే రెండు హృదయాల
అఖండ జ్వలిత దీపం కదా..??

- డాక్టర్‌ పెరుగు రామకృష్ణ
98492 30443