Nov 08,2023 21:05

హైదరాబాద్‌ : ప్రముఖ విత్తన కంపెనీ కావేరీ సీడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 13.77 శాతం వృద్థితో రూ.96.12 కోట్ల రెవెన్యూ సాధించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.84.40 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఇదే సమయంలో రూ.2.72 కోట్లుగా ఉన్న నికర లాభాలు.. గడిచిన క్యూ2లో 2.94 రెట్లు పెరిగి రూ.10.72 కోట్లకు చేరాయి. 2023-24 తొలి ఆరు మాసాల్లో కంపెనీ రెవెన్యూ 5.75 శాతం పెరిగి రూ.863.42 కోట్లుగా.. 14.45 శాతం వృద్థితో రూ.278.56 కోట్ల లాభాలు ఆర్జించింది. అన్ని రకాల ప్రధాన విత్తన విభాగాల్లో మెరుగైన వృద్థిని సాధించామని కావేరీ సీడ్స్‌ సిఎండి జివి భాస్కర్‌ రావు పేర్కొన్నారు.

  • టాటా పవర్‌కు రూ.1,017 కోట్ల లాభాలు

టాటా పవర్‌ వరుసగా 16వ త్రైమాసికంలోనూ లాభాలు ప్రకటించింది. 2023ా24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 9 శాతం వృద్థితో రూ.1,017 కోట్ల నికర లాభాలు సాధించింది. రెవెన్యూ 9 శాతం పెరిగి రూ.15,442 కోట్లుగా నమోదయ్యింది. ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ తదితర కీలక విభాగాల్లో రెవెన్యూ పెరిగిందని ఆ సంస్థ తెలిపింది. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి క్లీన్‌ ఎనర్జీలో 5,500 మెగావాట్‌ సామర్థ్యం మైలురాయికి చేరినట్లు వెల్లడించింది.

  • రిలయన్స్‌ కాపిటల్‌కు రూ.239 కోట్ల నష్టాలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ కాపిటల్‌ రూ.239.32 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.215.23 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.434.46 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 10.29 శాతం పెరిగి రూ.6,392.6 కోట్లకు చేరింది. బుధవారం బిఎస్‌ఇలో రిలయన్స్‌ కాపిటల్‌ షేర్‌ ధర 4.75 శాతం పెరిగి రూ.11.92 వద్ద ముగిసింది.