
ఇటీవల బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై సంయుక్తంగా నిర్వహించిన శ్రీమతి మాలతీ చందూర్ గారి 'హృదయనేత్రి' నవలపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాల పోటీలో కవి, రచయిత, విమర్శకుడు డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనతో సంభాషణ... టూకీగా ...
పోటీలో విజేతగా నిలవడంపై మీ అనుభూతి ?
చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీలో ఒకరే విజేత. వారికి రూ.25వేలు నగదు బహుమతి ఇస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఈ పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలు వచ్చాయట. ముగ్గురు జడ్జీలు నిర్ణయించిన ఈ పోటీలో నా పేరు ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషమైన విషయమే కదా. అలాగే ఈ నెలలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి 'ప్రజాపద్యం' వారు నిర్వహించిన ఆధునిక పద్య నాటకాల పోటీలో కూడా ద్వితీయ బహుమతి పొందాను.
మీకు పరిశోధనా మెలకువలు ఎలా పట్టుబడ్డాయి ?
డా.అద్దేపల్లి రామమోహనరావు నాకు సాహిత్య గురువు. ఆయన చెప్పిన సిద్ధాంతాల మీదనే పరిశోధనలు సాగిస్తూ ఉంటాను. అనేక పరిశోధనా గ్రంథాలను చాలా లోతుగా అధ్యయనం చేసిన అనుభవం కూడా ఉంది.
మంచి విమర్శకులుగా రచనలో మంచిచెడ్డల విశ్లేషణ ఎలా చేయాలి ?
ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు, ఉపరితల స్పర్శ కాకుండా అన్ని కోణాల్లో పరిశీలిస్తూ చదవాలి. అలాగే చదివేటప్పుడు దాన్లో ఉన్న ముఖ్య విషయాలను ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉండాలి. మంచి విషయాలను ముందుగా చెప్పి తర్వాత లోపాలను రేఖామాత్రంగా ఎత్తి చూపాలని డా.అద్దేపల్లి ఎప్పుడూ అనేవారు.
పద్య రచయితగా మొదలై ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో కథ, వ్యాసం, విశ్లేషణ విస్తతంగా చేయడం వెనుక మీకు స్ఫూర్తి ?
సహజంగా నాకు అన్ని ప్రక్రియలూ ఇష్టమే. పద్యాల్లో, కథల్లో, నాటకాల్లో, వ్యాసాల్లో అన్నింటిలోనూ బహుమతులు వచ్చాయి. పద్యం నాకు వంశానుగతంగా వచ్చిందని అనుకుంటాను. ఏ విషయమైనా చైతన్యంలో లీనమయేంతగా అధ్యయనం చేయడం చాలా అవసరమని నా అభిప్రాయం.
ఏ సాహిత్య ప్రక్రియపై శ్రద్ధ పెట్టాలనుకుంటున్నారు ?
సమాజావసరాల కనుగుణంగా ఏయే ప్రక్రియలు దేనికి సరిపోతాయో అన్నింటిమీదా పరిశ్రమిస్తూనే ఉంటాను.
మీ రచనల ప్రణాళిక వివరించండి.
ప్రస్తుతానికి అన్నమాచార్య ప్రాజెక్టు వారిచ్చిన కీర్తనలకు వ్యాఖ్యానాలు రాస్తున్నాను. విమర్శ, సమీక్షలపై ఎక్కువ కషి చేయాలని అనుకుంటున్నాను.
నెల్లూరు జిల్లా అరసం ఉపాధ్యక్షునిగా అభ్యుదయ రచనలు ఏవి వెలువరించాలనుకుంటున్నారు ?
ఆరుద్ర గారు వ్రాసిన 'సమగ్రాంధ్ర చరిత్ర' గానీ, సి.నా.రె గారి 'ఆధునికాంధ్ర కవిత్వం' సిద్ధాంత గ్రంథం కానీ ఒక దశ దగ్గర ఆగిపోయాయి. తరువాత వచ్చిన కవితోద్యమాలన్నీ గ్రంథాలుగా కొన్ని వచ్చినప్పటికి, సమగ్రమైన గ్రంథంగా రాలేదని నా అభిప్రాయం. ఆ పని చేయాలని డా.అద్దేపల్లి అనుకున్నారు కానీ చేయలేకపోయారు. ఆయన శిష్యుడిగా, ఆరుద్ర గారికి కొనసాగింపుగా 'ఆధునికాంధ్ర సాహిత్యం-సమగ్ర పరిశీలన' అనే ఒక ప్రామాణిక గ్రంథం రాయాలని ఉంది.
సంభాషణ : డా.పెరుగు రామకృష్ణ,
98492 30443