- అలల ఉధృతికి కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు ఛిద్రం
- ధ్వంసం అవుతున్న 'జియో ట్యూబ్'
- సముద్రంలో కలిసిపోతున్న గృహాలు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : తుపానులు, అల్పపీడనాల సమయంలో అలల ఉధృతితో సముద్ర తీరానికి తూట్లు పడుతోంది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కోతతో పలు గృహాలు సముద్రంలో కలుస్తున్నాయి. తీరాన్ని కాపాడేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా అము చేసిన జియోట్యూబ్ టెక్నాలజీ అలల తాకిడికి పూర్తిగా దెబ్బతింది. దీంతో, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో తీరప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లడిల్లుతున్నారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం క్రమంగా కనుమరుగవుతోంది. గతంలో పేతారు, తిత్లీ, ఫణి, హెలిన్ వంటి తుపానుల సమయంలో ఉప్పాడ, కోనపాపపేట, సూరాడపేట తదితర గ్రామాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. గడిచిన 50 ఏళ్లలో ఇక్కడ తీరం కిలోమీటరుకుపైగా ముందుకు చొచ్చుకొచ్చింది. ఫలితంగా 1,500 వరకూ ఇళ్లు, పలు దేవాలయాలు, ప్రభుత్వ భవనాలు సైతం సముద్రంలో కలిసిపోయాయి. 500 ఎకరాల పైబడి వ్యవసాయ భూమి కనుమరుగైందని స్థానిక మత్స్యకారులు తెలిపారు.
తునాతునకలైన 'జియోట్యూబ్'
18 సంవత్సరాల క్రితం 2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీ కారణంగా ఈ ప్రాంత ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. తీరప్రాంతం కోతకు గురికాకుండా ఉప్పాడ శివారు కొత్తపట్నం నుంచి బర్మా కాలనీ వరకూ 200 మీటర్ల పొడవున 2005 మార్చిలో కోటి రూపాయలతో ఆర్ అండ్ బి అధికారులు పెద్ద పెద్ద బండరాళ్లను వేశారు. అయినా, సముద్రపు కోతను నివారించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అప్పటి కేంద్రం మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు హయాంలో రూ.14 కోట్లతో 1.53 కిలోమీటర్ల పొడవున 2007లో జియోట్యూబ్‌ను నిర్మించారు. దీంతో, తీర ప్రాంతం కోతను కొంతకాలం పాటు నివారించగలిగారు. ఖైముక్, నీలం తుపానుల సమయంలో జియోట్యూబ్ ఈ తీరాన్ని కోత నుంచి కాపాడింది. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడంతో ప్రస్తుతం ఇధి ధ్వంసమైంది.
బీచ్ రోడ్డుకు రక్షణ కరువు
కాకినాడ నుంచి ఉప్పాడ వరకు సుమారు 15 కిలోమీటర్ల పొడవునా బీచ్ రోడ్డు ఉంది. మాయాపట్నం నుంచి కాకినాడ వైపు బీచ్ రోడ్డు గుండా సుమారు ఒక కిలోమీటరు పొడవున సమద్రకోత నివారణకు బండరాళ్లు, రెండు వేల సిమెంటు దిమ్మలు డంప్ చేశారు. అయినా, సముద్ర కోతను అడ్డుకోలేకపోయారు. దీంతో, చిన్నపాటి కెరటాలకే ఉప్పాడ - కాకినాడ బీచ్‌రోడ్డు ఛిద్రమవుతోంది. మరమ్మతులకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. ఉప్పాడ తీరమంటే కాంట్రాక్టర్లకు కాసుల పంటగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నిమార్లు మొరపెట్టినా అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారానికి పట్టించుకోవట్లేదని మత్స్యకారులు, తీర ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భయం భయంగా జీవిస్తున్నాం
ఐదేళ్ల కాలంలో సముద్రపు కోత తీవ్రంగా ఉంది. తుపానులు వచ్చినప్పుడల్లా తీర ప్రాంతంలో ఉన్న ఇళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయం భయంగా జీవించాల్సి వస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తీరప్రాంత రక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి.
- గంట అప్పారావు, మత్స్యకారుడు,
ఉప్పాడ, యు.కొత్తపల్లి మండలం
శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
తీర ప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా సుమారు రూ.34 కోట్లతో రక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్నాయి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీరప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
- వంగా గీత, కాకినాడ ఎంపి










