Aug 05,2023 09:53
  • ఆగస్టు 1 - 7 : తల్లిపాల వారోత్సవాలు

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి. కాన్పు తర్వాత మొదటి రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు చాలా ముఖ్యమైనవి. భావి ఆరోగ్యానికి తొలి బీజం వేసేవి ఇవే. ఇవి ఒక రకంగా తొలి టీకా లాంటివి. ఇందులో ఉండే ఇమ్యునోగ్లోబులిన్లు బిడ్డ రోగనిరోధక శక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఇన్‌ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడతాయి. ఐదారు రోజులకు పాలు కాస్త పలుచబడినప్పటికీ వాటిలో కొవ్వులు, లాక్టోజ్‌ బాగా ఉంటాయి. అవి బిడ్డకు మరింత శక్తినిస్తాయి. రెండు వారాల తర్వాత తల్లిపాలలో 90 శాతం నీరు., 8 శాతం పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు.. 2శాతం ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా బిడ్డ అవసరాలకు అనుగుణంగా మారిపోయే తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు.

11

                                                                           అపోహలు వద్దు

బిడ్డ పుట్టిన తరువాత మొదటి ఆరు నెలలు కూడా బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదు. బిడ్డను తల్లిపాలకు దూరం చేయడం అర్థరహితం. తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడో, పాలు పడనప్పుడో బిడ్డకు ఇతర ఆహారం ఇవ్వాలి. తల్లిపాల విశిష్టత గురించి ఎంతగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. బిడ్డకు అవసరమైన పోషకాలన్నీ కూడా తల్లిపాలలోనే ఉంటాయి. పాలు పట్టేందుకు ముందుగా ప్రతిసారి రొమ్ము శుభ్రం చేసుకోవాలి. వైద్యుల సూచన మేరకే పాలు పట్టడం ఆపాలి తప్పితే సాధారణ పరిస్థితుల్లో, సాధారణ అనారోగ్యాలు ఉన్నప్పుడు పాలు పట్టొచ్చు. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి బిడ్డను కాపాడేది తల్లిపాలే. తల్లికి, పాలు తాగే బిడ్డకు ఎలాంటి సమస్య రానంత వరకూ, తల్లి గర్భంతో ఉన్నా కూడా బిడ్డకు పాలు ఇవ్వొచ్చు. తల్లి సరైన రీతిలో పోషకాహారం తీసుకుంటే చాలు. అతిగా ఆహారం తీసుకోవడం, మరీ ఎక్కువగా పాలు తాగడం చేయనవసరం లేదు.
                                                                     - డాక్టర్‌ ఎస్‌.ఇందిరాదేవి
                                                      మెడికల్‌ సూపరింటెండెంట్‌ డిసిహెచ్‌ఎస్‌, గుడివాడ.

 

222

                                                                           తల్లికీ బిడ్డకూ ఆరోగ్యమే

ప్రపంచ తల్లిపాల దినోత్సవ కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచి ఏడోతేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. తల్లి పాలు ఇవ్వటాన్ని ప్రోత్సహించండి. ఇది మనందరి బాధ్యత అనే నినాదంతో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. సాధారణ, సి సెక్షన్‌(సిజేరియన్‌) డెలివరీ రెండింటిలోనూ డెలివరీ అయిన ఒక గంటలోపు తల్లి తమ బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తల్లికి, బిడ్డకు ఆరోగ్యకరం. తల్లి పాల వారోత్సవాల్లో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లులు పౌష్టికాహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బాదం, జీడిపప్పు వంటివి కూడా తింటుండాలి. తినే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఉండేలా చూడాలి. నువ్వుల నూనెతో చేసిన వంటకాలు తినటం మంచిది. తల్లి ఆవుపాలు తాగితే మంచిది. తల్లిపాల ఉత్పత్తికి ప్రధానంగా చేయాల్సింది తల్లులు చిన్నా రులకు తరచుగా పాలు పట్టడం. పాల ఉత్పత్తి పాలు తాగడం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు చాలామంది నీరుగానీ, గ్లూకోజు నీరుగానీ, చక్కెరగానీ, తేనెగానీ తాగిస్తుంటారు. వీటివల్ల కడుపు నిండి శిశువు పాలు తాగే ప్రయత్నం చేయదు. పాల ఉత్పత్తి ప్రక్రియ జరగదు. అంతేగాక వీటి ద్వారా చిన్నారులు సూక్ష్మజీవుల బారిన పడే ప్రమాదముంది.
                        - డాక్టర్‌ ఎస్‌.మల్లేశ్వరమ్మ
వైద్యాధికారి, కింతలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శ్రీకాకుళం జిల్లా

 

333

                                                                    శిశువులు ఆరోగ్యంగా పెరుగుతారు

తల్లిపాలు ఉత్పత్తి సరఫరా ప్రక్రియను ఇంగ్లీషులో 'టైలర్‌ మేడ్‌' అంటారు. ప్రకృతి శిశువులకు ఎప్పుడు ఏది అవసరమో అది తల్లుల ద్వారా అందించింది. మరో ఆలోచన అనవసరం. తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. కొందరు తల్లులు పిల్లల్ని ఎక్కువగా కదిలిస్తారు. అందువల్ల తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో 'పొసెట్టింగ్‌' అంటారు. ఇది వాంతి వ్యాధి కాదు. ఈ సహజ చర్యకు ఎలాంటి మందులు వాడకూడదు. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది. పాలుపట్టిన తర్వాత శిశువులను ఎక్కువగా కదిలించరాదు. చిన్నారుల్లో ఏడుపునకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఆకలి కూడా ఒకటి. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు రోజుకు ఆరుసార్ల కన్నా ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేస్తుంటే, సంతృప్తికరమైన పెరుగుదల ఉంటే చిన్నారులకు తల్లిపాలు సరిపోయినట్లే.
                                                                                  - డాక్టర్‌ ఎస్‌.మాధవీలత
                                                                   గైనకాలజిస్ట్‌, నందిగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి

 

55

                                                                         రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

తల్లి పాలు వల్ల ఇన్ఫెక్షన్లు, డయేరియా, శ్వాసకోశ వ్యాధులు, వాంతులు, వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. తల్లికి బ్రెస్ట్‌ కాన్సర్‌, అండాశయ క్యాన్సర్లు వంటివి రాకుండా ఉంటాయి. శిశివులకు 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. ఈ పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, అధికంగా ఉండి, రోగ నిరోధక శక్తిని కల్గి ఉంటాయి. దీనితో బిడ్డ ఆరోగ్య కరమైన బరువుతో పెరటానికి తోడ్పడుతుంది. ఈ పాలు తేలికగా జీర్ణం అవుతాయి. తల్లి పాలు పెట్టడం వల్ల తల్లి మానసిక వత్తిడికి దూరం అవుతారు. తల్లిపాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తమ బిడ్డలకు ఆరోగ్యకరమైన పాలు ఇవ్వాలి.
                        - శారమ్మ, పిల్లల వైద్య నిపుణురాలు, గన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

 

77

                                                                   ముర్రుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టం

తల్లిపాల ఆవశ్యకతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ (యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌)లు ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టాలని సూచిస్తున్నాయి. శిశువు పుట్టిన గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాలని సిఫార్సు చేశాయి. అయితే బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెందాలంటే కనీసం రెండు సంవత్సరాలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెబుతున్నాయి. ప్రతి తల్లి తన బిడ్డకు సరిపోను పాలు ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలు పిల్లలకు మాత్రమే కాదు తల్లులకు కూడా ఆరోగ్యమే. తల్లి పాలు సమృద్ధి కరమైన, అనేక పోషక విలువలు కలిగిన ఒక దివ్యోషధం వంటివి. బిడ్డ పుట్టిన మొదటి గంట లోపే ముర్రు పాలు పట్టించాలి.
                                                                                                       - డాక్టర్‌ టి. సాయి ప్రసన్న
                                                                                          వైద్యాధికారి, తోట్ల వల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం