Oct 21,2023 11:08

టెల్‌ అవీవ్‌ : పాలస్తీనీయులపై ఇజ్రాయిలీ రక్షణ దళాలు జాతి ప్రక్షాళన సాగించే ప్రమాదముందని హెచ్చరించినందుకు ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ ఎంపి ఆఫర్‌ కాసిఫ్‌పై పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ 45 రోజుల పాటు బహిష్కరణ వేటు వేసింది. 45 రోజుల పాటు పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించింది. కాసిఫ్‌ ఒక ఇంటర్వ్యూలో ఇ్పజాయిల్‌ ప్రధాని నెతన్యాహు గాజాపై సాగిస్తున్న యుద్ధాన్ని విమర్శించారు. ఆయన ఇజ్రాయిలీ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ ఈక్వాలిటీ (హదాష్‌) తరపున పార్లమెంటుకు 2019 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయను యూదుడే అయినప్పటికీ యూదు ఆధిపత్యవాదాన్ని, జాత్యహంకారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2021లో తూర్పు జెరూసలెం నుంచి పాలస్తీనీయులను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని నిరిసిస్తూ ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయనను పోలీసులు చితకబాదారు. ప్రభుత్వం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా ఆయన నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉండడం పలువురి మన్ననలు అందుకుంది.