Jun 25,2023 17:00
  • దళితులను సాంఘిక బహిష్కరణపై ఖండన 
  • శాంతిభద్రతలను పునరుద్ధరించాలి 

ప్రజాశక్తి-విజయవాడ : తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెంలో దళితులపై పెత్తందారులు చేస్తున్న అరాచకాలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తిరుమలాయపాలెం ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దళితులపై దాడికి పాల్పడిన పెత్తందారులపై, వారికి కొమ్ము కాస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ(యంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి  వై.సాంబశివరావు,  పిఐ(యంఎల్‌)  రాష్ట్ర కార్యదర్శి  జాస్తి కిషోర్‌బాబు, యంసిపిఐ(యు) కాటం నాగభూషణం, సిపిఐ(యంఎల్‌) లిబరేషన్‌ యన్‌.మూర్తి, సిపిఐ(యంఎల్‌)న్యూడెమోక్రసీ చిట్టిపాటి వెంకటేశ్వర్లు, యస్‌యుసిఐ(సి) బి.ఎస్‌. అమర్‌నాథ్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌ పి.వి.సుందరరామరాజు,  రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జానకి రాములు ఉమ్మడిగా పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తొలగించిన ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.  
    తూర్పు గోదావరి జిల్లా తిరుమలాయపాలెంలో ప్రభుత్వ స్థలంలో దళిత యువత అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దీన్ని సహించలేని పెత్తందారులు విగ్రహాన్ని తొలగించడమే కాకుండా దళితులపై దాడులకు తెగబడ్డారని,  వారికి తిండి, నీరు, మందులు, కనీస అవసరాలు ఏవీ అందకుండా సాంఘిక బహిష్కరణ చేశారని తెలిపారు. చివరికి వారికి వస్తువులు ఏమైనా అమ్మితే జరిమానా విధిస్తామని దుకాణాలకు ఆదేశాలు జారీ చేశారని ఆగ్రహించారు. నిత్యావసరాలు అందజేయడానికి వెళుతున్న దళిత సంఘాల కమిటీ వాహనాలను పోలీసులు అడ్డుకుని తిప్పి పంపించేస్తున్నారని మండిపడ్డారు. చట్టప్రకారం శాంతిభద్రతలు కాపాడాల్సిన  పోలీసులు దళిత యువకులపై దాడి చేయడం గర్హనీయమన్నారు. పార్టీలకతీతంగా దళిత భరోసా యాత్ర చేస్తుంటే దాన్ని కూడా సహించలేక పోలీసులు అడ్డుకుని విచక్షణారహితంగా అరెస్టులు చేశారని తెలిపారు. పోలీసుల అండతో పెత్తందారులు అడ్డుఅదుపూ లేకుండా దళితులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. బహిష్కరణ వార్తలు వస్తున్నా ఎస్సీ కమిషన్‌ ఇంతవరకు జోక్యం చేసుకోలేదని విమర్శించారు. 
    రాజ్యాంగ నిర్మాత డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా సహించలేని స్థితిలో ఉండడమంటే రాష్ట్రంలో కులవివక్ష తీవ్రత అర్ధమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దళితులపై దాడులకు పాల్పడిన వారిపై, సాంఘిక బహిష్కరణ విధించి వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దళితులకు అండగా నిలబడాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.