ఇంఫాల్ : తమ రాష్ట్ర ప్రజలకు యోగా కన్నా కూడా శాంతి భద్రతలు అవసరమని మణిపూర్‌కి చెందిన సామాజిక సంస్థ పేర్కొంది. ప్రజలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ యోగా డేను బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఒకవైపు మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతుండగా... ప్రధాని మోడీ న్యూయార్క్‌లో యోగా వేడుకలను నిర్వహించేందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ కార్యక్రమానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో భారీ ఆందోళన చేపట్టారు. 36 పౌర సమాజ సంస్థల అపెక్స్ బాడీ అయిన తౌబల్ అపున్బ్ లుప్ ఇంఫాల్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న తౌబల్ మేలా గ్రౌండ్‌లో ఉదయం 8 గంటల నుండి గంట పాటు ఆందోళనను చేపటింది. 300కు పైగా విద్యా సంస్థలు, మహిళా సంఘాలు, ప్రజలు ఈ నిరసనలో పాల్గన్నారు. మహిళలు, విద్యార్థులు మోడీని విమర్శిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాష్ట్రంలోని హింసాత్మక పరిస్థితులను అదుపు చేయడంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌లు విఫలయ్యారని మండిపడింది.
తాము యోగాకు, అంతర్జాతీయ యోగా డేకు వ్యతిరేకం కాదని అన్నారు. మే 3 నుండి మణిపూర్‌లో ప్రజలు హింసాకాండ ఘటనలతో బాధపడుతుంటే ప్రధాని పట్టించుకోకుండా... ప్రత్యేక యోగా సెషన్ కోసం వెళ్లారని తౌబల్ అపున్బ్ లుప్ (హక్కుల సంస్థ) అధ్యక్షుడు, నిరసన నిర్వాహకుడు రోమేశ్వర్ వైఖ్వా పేర్కొన్నారు. రాష్ట్రంలో అశాంతి నెలకొనడంతో... ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టడం లేదని అధికారులు ప్రకటించారని అన్నారు. కానీ రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మాత్రం మౌనం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.