ప్రజాశక్తి - మద్దిపాడు (ప్రకాశం జిల్లా) :ఎపి బ్రాండ్ వాల్యూ పెంచే విధంగా కొత్త పాలసీలు ప్రకటిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారం ప్రకాశం జిల్లా గుండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. క్యాంపు వద్ద వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌తో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వేయకపోవడం వల్ల కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. యుపిపిఎస్‌సి తరహాలో ఎపిపిఎస్‌సిని బలోపేతం చేస్తామని, ఒక్కో జిల్లాలో ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తామని, కెజి టూ పిజి విద్యను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రొఫెషనల్స్ అంతా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరారు. సంతనూతలపాడు నియోజవర్గం నుంచి బాపట్ల జిల్లా అద్దంకిలో యాత్ర ప్రవేశించింది.










