Jul 09,2022 07:12

రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యంగా ఒకప్పుడు ప్రపంచ మానవాళిపై పెత్తనం చెలాయించిన బ్రిటన్‌ ఇప్పుడు ఇంటిని కూడా చక్కదిద్దుకోలేని దుస్థితిలో పడింది. కన్జర్వేటివ్‌ పార్టీ సభాపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయడం బ్రిటన్‌ సంక్షోభ పరిస్థితులకు అద్దం పడుతోంది. ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకడంతో మాంద్యం దిశగా పయనిస్తున్న ఆర్థిక నావను ఎలా ఒడ్డుకు చేర్చాలో తెలియని స్థితిలో బోరిస్‌ ప్రభుత్వం బోర్లా పడింది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో బోరిస్‌ గ్రాఫ్‌ పూర్తిగా పడిపోయింది. సామ్రాజ్యవాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం ఇంకెంత మాత్రం ఈయనవల్ల కాదని గ్రహించిన కులీన వర్గాలు కూడా నాయకత్వ మార్పును కోరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బోరిస్‌ నిష్క్రమించారు. ఏ కాస్త అవకాశమున్నా పదవిలో కొనసాగాలని చివరిదాకా యత్నించారు. కానీ ఆయనకున్న దారులన్నీ మూసుకుపోయాయి. 48 గంటల్లో 58 మందికిపైగా మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయడం, వచ్చేవారం రెండవ సారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన తప్పనిసరి పరిస్థితి రావడంతో వేరే గత్యంతరంలేని స్థితిలో వైదొలగాల్సి వచ్చింది. వచ్చే అక్టోబరులో కొత్త ప్రధానిని కన్సర్వేటివ్‌ పార్టీ ఎన్నుకునే వరకు తనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.
          బ్రిటన్‌లో నాయకత్వ తిరుగుబాటు రావడం ఇదే తొలిసారి కాదు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ప్రజల్లో ఎగిసిపడిన అసంతృప్త జ్వాలలకు పాలక వ్యవస్థల్లో గతంలోనూ కుదుపులు చోటుచేసుకున్నాయి. మహా ఆర్థిక మాంద్యం (ది గ్రేట్‌ డిప్రెషన్‌) నెలకొన్న కాలంలో అంటే 1932లో రామసే మెక్‌డొనాల్డ్‌కు వ్యతిరేకంగా 11 మంది మంత్రులు తిరుగుబాటు చేయడం బ్రిటీష్‌ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న రికార్డు. బోరిస్‌ ఇప్పుడు ఆ రికార్డును చెరిపేశారు. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఊబిలోకి నెట్టేసి బోరిస్‌ ఇంటిదారి పట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్‌ను యుద్ధంగా చూపెట్టి సంక్షోభ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని వేసిన ఎత్తులన్నీ చిత్తు అయ్యాయి. థాచరైట్‌ విధానాలు తీసుకొస్తానని బ్రెగ్జిట్‌ నేపథ్య రాజకీయ అనిశ్చితిలో తెర మీదకు వచ్చిన బోరిస్‌ ఆ అనిశ్చితిని, సంక్షోభాన్ని పెనం నుంచి పొయ్యిలోకి తోశారే కానీ చక్కదిద్దింది లేదు. మీడియాను మ్యానిప్యులేట్‌ చేయడం ద్వారా యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు) వ్యతిరేక సెంటిమెంటును ప్రజల్లో ఎగదోసేందుకు విఫలయత్నం చేశారు. ఇయుతో వాణిజ్య బంధం దెబ్బతిని లేబర్‌ మార్కెట్‌పైనా, వేతన జీవులపైనా పెను ప్రభావం చూపింది.
        'ప్రజాకర్షక' విధానాల మాటున స్వేచ్ఛామార్కెట్‌ను విస్తరింపజేసి ప్రజలను గంపగుత్తగా దోపిడి చేసేందుకు ఉద్దేశించిన పెట్టుబడి నియంతృత్వ విధానాలను, ప్రత్యేకించి మితవాద టోరీల ఆర్థిక మార్గదర్శకులైన థాచరేట్‌ కలలను సాకారం చేసేందుకు బోరిస్‌ చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. కోవిడ్‌ మహమ్మారి కోరలు చాచి రెండు లక్షల మంది ప్రాణాలను మింగిసేనా...కార్పొరేట్‌ కంపెనీల లాభాలపైనే ఆయన ధ్యాస పెట్టారే తప్ప ప్రజల ప్రాణాలకు విలువివ్వలేదు. 'హెర్డ్‌ ఇమ్యూనిటి' అనే సాకుతో లాక్‌డౌన్‌ ఎత్తివేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న 'రాజకీయ నేరగాడి'గా ఆయన అంతర్జాతీయంగా అపఖ్యాతి మూటగట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఉద్దీపన ప్యాకేజీల పేరుతో ప్రజల సంపదనంతా కార్పొరేట్‌ కంపెనీలకు, శతకోటీశ్వర్లకు దోచిపెట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 'పెట్టుబడి' నియంతృత్వాన్ని కొనసాగిస్తున్న బోరిస్‌ను ఏనాడు తప్పుబట్టని టోరీల తిరుగుబాటు నేతలు ఇప్పుడు ఉన్నపళంగా గొంతులు చించుకోవడానికి కారణం లేకపోలేదు. దాదాపు ఐదు లక్షల మంది పైగా రైల్వే ఉద్యోగులు మూడు రోజుల చారిత్రాత్మక సమ్మె చేపట్టారు. నిరుద్యోగం కోరలు చాచడంతో యువతరం అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ పరిణామాలు 'పెట్టుబడి' పుట్టిని ముంచేసే ప్రమాదముందని గ్రహించే... 'అసమర్థుడు' అనే ముద్ర వేసి బోరిస్‌ను సాగనంపుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించే కార్పొరేట్‌ ఎత్తుగడగానే బోరిస్‌ నిష్క్రమణను చూడాలి. ఆయన స్థానంలో ఏ 'టోరీ' వచ్చినా ప్రజలకు టోపీ పెట్టేవాడే కానీ ప్రయోజనాలను కాపాడే పరిస్థితి లేదు. జనరంజక పథకాలు, జాతీయవాదం మాటున ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే పాలకులకు బోరిస్‌కు పట్టిన గతే పడుతుంది.