
చిట్టి, చిన్ని, మున్ని కలిసి తాతయ్య దగ్గరకు వెళ్లి 'తాతయ్యా నువ్వు ఎందుకు ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం పట్టుకొని వుంటావు? దాని వల్ల ఉపయోగం ఏంటి? అస్తమానం పుస్తకం పట్టుకొని తిరిగితే నీకు విసుగు రాదా...?' అని అడిగారు.
'లేదు.. పిల్లలూ, నిజానికి పుస్తకం నా చేతిలో ఉంటేనే నాకు సంతృప్తిగా ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి' అని బదులిచ్చాడు తాతయ్య.
'పుస్తకం వల్ల విజ్ఞానం, వివేకం, వినోదం కలుగుతుందని విన్నాం కానీ పుస్తకం చేతిలో ఉంటే గౌరవం ఎలా పెరుగుతుంది? అది మేమెప్పుడూ వినలేదే...!' అని అన్నది చిట్టి.
'మాకు నమ్మకం లేదు' అని చిన్న నవ్వు నవ్వారు చిన్ని, మున్నీ.
''అయితే రచ్చబండ వద్దకు వెళ్దాం పదండి. ఈ పుస్తకం విలువ ఏంటో మీకు అర్థం అవుతుంది.'' అని పిల్లల్ని రచ్చబండ వద్దకు తీసుకొని వెళ్ళాడు తాతయ్య.
అక్కడ తాతయ్య కన్నా పెద్దవాళ్లు, చిన్న వాళ్లువున్నారు. వాళ్లు తాతయ్య చూడగానే నిలబడి నమస్కరించారు. ''రండి రండి... ఈ రోజు కొత్త పుస్తకాన్ని తెచ్చినట్లు వున్నారు. అందులో ఉన్న మంచి విషయాలను చెప్పండి. మీ చేతిలో పుస్తకం చూస్తే మాకు ఆనందంగా ఉంటుంది.'' అని అన్నారు. అది చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. అప్పుడు అర్ధమయ్యింది, పుస్తకం విలువ. పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే కాదు; గౌరవ, మర్యాదలు కూడా పొందవచ్చునుకున్నారు.
- ఎం వి స్వామి
94415 71505