ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) : వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన బెజవాడ టైగర్స్ జట్టు ఎట్టకేలకు బోణీకొట్టింది. విశాఖలోని ఎసిఎ - విడిసిఎ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) సీజన్ 2లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ జట్టుపై విజయం సాధించింది. తొలుత టాస్ గెలుచుకున్న ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. కానీ, జట్టు ఓపెనర్లు అంతగా రాణించలేదు. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు జి శ్యామ్ సుందర్, ఎస్‌వి రాహుల్ మాత్రం చక్కని ఆటతీరుతో 77 బంతుల్లో 86 పరుగులతో మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పారు. మొత్తానికి 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 159 పరుగులు సాధించింది. బెజవాడ టైగర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ 160 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టంతో గెలుపు అందుకున్నారు. ఓపెనర్ బ్యాట్స్‌మ్యాన్ కె మహీప్ కుమార్ 51 బంతుల్లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లుతో 77 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.










