Jun 30,2023 18:10

లాపాజ్‌  :  బొలీవియా  లిథియం పారిశ్రామికీకరణలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు యురేనియం గ్రూపుల్లో ఒకటి, రష్యా అనుబంధ సంస్థల్లో ఒకటైన రోసాటమ్‌ గురువారం బొలీవియా  ప్రభుత్వ సంస్థ లిథియం కంపెనీ వైఎల్‌బితో జరిగిన ఒప్పందంపై సంతకం చేసింది.  బొలీవియాలోని పొటోసి నుండి లిథియం కార్బోనేట్‌ వెలికితీయడంతో పాటు ఉత్పత్తికి సంబంధించి పారిశ్రామిక సముదాయాన్ని నిర్మించడం కోసం ఒప్పందం చేసుకున్నట్లు రోసాటమ్‌ ప్రెస్‌ సర్వీస్‌ తెలిపింది. ఈ ప్రాజెక్టు దక్షిణ అమెరికా దేశంలో ప్రాజెక్టు పూర్తి ఉత్పత్తి గొలుసును సృష్టిస్తుందని రోసాటమ్‌ ప్రెస్‌ సర్వీస్‌ తెలిపింది. ఈ ఒప్పందం రష్యా, బొలీవియాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి కొత్త అవకాశాలను సృష్టించిందని రష్యన్‌ కంపెనీ మొదటి డిప్యూటీ జనరల్‌ డైరెక్టర్‌ కిరిల్‌ కొమరోవ్‌ తెలిపారు. రోసాటమ్‌ కోసం లిథియం ఉత్పత్తి రంగంలో విదేశాలలో ఇది మొదటి భారీ స్థాయి  ప్రాజెక్ట్‌ అని పేర్కొన్నారు. ఈ పారిశ్రామిక సముదాయం ఏడాదికి 25,000 టన్నుల లిథియం కార్బోనేట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అన్నారు. భౌగోళిక, వెలికితీత పరిస్థితులను అనుసరించి ఈ సామర్థ్యం మరింత పెరగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమైన వనరు (లిథియం) పారిశ్రామికీకరణ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని బొలీవియా అధ్యక్షుడు లాయిస్‌ అర్సే పేర్కొన్నారు.