Jun 25,2023 10:01

వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఎండా కాస్తుంది. ఇటువంటప్పుడు శరీరానికి గోరు వెచ్చని నీళ్లు సహాయపడతాయి. పోషకాహారం ఎంత ముఖ్యమో నీళ్లూ అంతే అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. తాగే నీళ్లు వేడిచేయడం వల్ల కంటికి కనిపించని క్రిములు, కీటకాలు కూడా నశించిపోతాయి. దాంతో జలుబు, దగ్గు, జ్వరాలు రావు.

  • చల్లని వాతావరణం ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి బద్ధకం తగ్గి యాక్టివ్‌గా మారుతుంది. చలి, వణుకు లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి.
  • అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజు వేడి నీరు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
  • ఆడవాళ్లకు నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారమవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగూ అలసటా తగ్గుతాయి. పీరియడ్స్‌ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మొటిమలు రావు. చుండ్రు రాదు. జుట్టు రాలదు, కుదుళ్లు బలపడతాయి.
  • వేడి నీళ్లతో అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి. జీర్ణప్రక్రియను వృద్ధిచేసి మలబద్ధక సమస్యను నివారిస్తాయి. కడుపు నొప్పి, అజీర్తి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
  • వేడినీళ్లు తాగితే.. నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో మలినాలన్నీ వెళ్లిపోతాయి.
  • చల్లటి నీళ్లు తాగడం వల్ల పంటి సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అదే వేడి నీళ్లు తాగితే క్రిములు చచ్చిపోయి దంత సమస్యలు తగ్గుతాయి.
  • కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగితే, ఆర్థరైటీస్‌ సమస్యలు తగ్గుతాయి. శరీరం పొడిబారదు. ముఖం కాంతిమంతంగా ఉంటుంది.