ఏ ఇచ్చికాలాడిందో
మా అడవిచుక్కని మనువాడీ ..
మా గూడకొచ్చిందో నీలిరంగు తోడేలు
మా హక్కులకోసం అనిగాసీ ..
మా వెంటే మసలేది
మా బతుకుల్లానే .. కుసులూడిన
మా కుక్కిమంచాల మీద తొంగుండేది
మాతో పాటు కలోగంజో తాగేది
తుడుంగొడుతూ .. థింసాలాడేది
గోచీ కట్టుకున్న
మా గొంగళి పురుగులతో గూటీ బిళ్లాడేది
నిప్పును అరిసేతపట్టీ ..
నిజాయితీకి నిలువుటద్దాన్ననేది !
కొన్నాళ్లకి ..
అయిదేళ్ల జాతరలో అధికారం చిక్కింది
అరిసేతిలో నిప్పు ఆరిపోయింది
కరిమబ్బు కొండల్ని ఆవహించినట్టు
దానినావహించింది రాజ్యం
వాన కురిసీ .. దాని నీలిరంగు వెలిసిపోయింది
మా అడుగక్కడే ఆగిపోయింది
దానిచుట్టూరా మొలుచుకొచ్చింది
తుపాకుల పెండె
కార్పొరేట్ మృగాలు చుట్టాలయ్యేయి
అయినోళ్లకు ఆకుల్ల .. కానోళ్లకి కంచాళ్ల
అందలమెక్కించిన వాళ్లమే
ఇయ్యాల అలగాజనమై పోయేము!
ఇయ్యాల ..
మార్చుకుంది దాని దోపిడీ రూపం ..
కన్నుగానక పులి .. పిల్లల్ని తినేసినట్టు
మా బొటనవేళ్లు తెగ్గోసీ
కంపెనీలకు తాకట్టుబెట్టింది మా బతుకుల్ని ..
కాళ్లకింద మట్టిని దువ్వేసీ
గనుల కోసం జల్లెడ పట్టింది అడవిని ..
నేలకూల్చింది ఎదురు తిరిగిన ఎర్రపొద్దుల్ని
గడపగడపలో ఇనుప దడులు ..
నెత్తుటి వాగులు వీధులు ..
ఎటుజూసినా శవాల దిబ్బలు
గూడెం .. ఇయ్యాల కనిపించని కారాగారం !
ఏందయ్యా .. యిలా అయిందనీ
మా పెద్దయ్యనడిగితే అంటాడూ ..
కుక్కలకి అధికారమిస్తే ..
కుండలన్నీ సెండోబండారం జెయ్యవా అనీ ..!
నిజమే ..
పులులు మేకల్ని వేటాడతాయి .. అదీ అడవి
మనిషిని మనిషి వేటాడుతాడు .. యిదీ సమాజం !!
- సిరికి స్వామినాయుడు,
94940 10330










