Oct 23,2023 07:58

తమకంటూ ఒక గూడు మిగలకపోయినా
తమ వారికంటూ భద్రమైన
ఒకింత చోటు దక్కకపోయినా
యుద్ధంలో పుట్టి యుద్ధం కోసమే బతికే
ఏ దేశమంటూ లేని ఎవరు ఈ ప్రజలంతా?

ఊపిరి దీపాలెన్ని ఆరిపోతున్నా
ప్రాణమనుకుని, పుట్టిన ఆ మట్టి దీపపు
నెత్తుటి చమురులోనే
వత్తులై వెలుగుతున్నారెందుకు?

ఇల్లొదిలి ఊరొదిలి
సరిహద్దు కంచెల చాటుకి కాందిశీకులై
పరుగులు తీసే ఇన్నిన్ని వేల
రక్తపు ముద్దల నేరమేమిటి?

పవిత్ర భూమి అనుకున్న ఒకే చోట
పుట్టింటి జాడల్ని స్వప్నించే రెండు తెగల్ని
శత్రు శ్మశానాలను కలగనే రెండు జాతుల్నీ
ఒకే జైలు గదిలో బంధించి
ఆయుధాలను తలుపులుగా కిటికీలుగా అమరుస్తున్నదెవరు?

మధ్యధరాకీ మృత సముద్రానికీ మధ్యలో
నిప్పులా రేగే యుద్ధ కడలి మీద
కన్నీటి కెరటాల ఈ అల్ప పీడన ద్రోణి
సద్దుమణిగే ఒక శాంతి వీచిక ఎప్పుడొస్తుంది?
 

- కంచరాన భుజంగరావు
94415 89602