- రూ.1 లక్ష కోట్లకు జిఎస్‌టి నోటీసులు
న్యూఢిల్లీ : ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పన్ను ఎగవేతలకు పాల్పడిన సంస్థలకు జిఎస్‌టి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయా కంపెనీలకు దాదాపుగా రూ.1 లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు జిఎస్‌టి సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వం సవరించిన జిఎస్‌టి చట్టం ప్రకారం అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి సంస్థలు రిజిస్టర్ కాలేదు. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జిఎస్‌టి చెల్లించాలని ఆగస్టులో సవరించారు. కానీ ఇప్పటివరకు పన్ను చెల్లించని గేమింగ్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పన్ను చెల్లించని కంపెనీలపై ఇప్పటి వరకు సుమారు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపిందని ఆ అధికారి పేర్కొన్నారు. అధిక పన్ను రేటుపై గేమింగ్ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. హెచ్చు పన్ను రేట్లను తగ్గించాలని.. శ్లాబు రేటు మార్చాలని ఆ రంగం డిమాండ్ చేస్తోంది.