Jul 23,2023 09:11

పట్టుదల వుంటే మనుషులు రుషులవుతారో.. లేదో.. కానీ డాక్టరేట్‌ సాధిస్తారని అనుభవపూర్వకంగా నిరూపించింది భారతి. కట్టుకోవడానికి మంచి చీరైనా లేని పరిస్థితుల్లో చిరిగిన, మాసిన బట్టలతోనే కాలేజీకి వెళ్లేది. ఒక రోజు కాలేజీ.. ఇంకో రోజు కూలీకెళ్తేనే కుటుంబం గడిచే పేదరికంలో చదువుకోసం పడరాని పాట్లు పడింది. పేదరికంలో పుట్టి ఎన్నో దుర్భర పరిస్థితులను దాటుకుని రసాయనశాస్త్రంలో పిహెచ్‌డి పట్టా సాధించిన సాకే భారతి గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది. ఈ విజయంలో భారతి భర్త పాత్ర కూడా గొప్పది. ఆమెకి చేదోడువాదోడుగా నిలిచాడు. భార్య చదువు కోసం రేయింబవళ్లు కష్టపడ్డాడు. ఈ రోజు ఆమె విజయం గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. ఈ విజయం వెనుక వారు పడ్డ అవమానాలు.. అవహేళనలు ఎన్నో ఉన్నాయి.

      ఆకలి బాధలని... అసమానతలను, అవమానాలను అధిగమించి మెరిసిన మట్టిలో మాణిక్యం భారతి. ఆడపిల్లగా పుట్టినందుకు చిన్నతనంలోనే తండ్రి చీదరింపులు... పూటగడవటమే కష్టమైన పేదరికపు ఆకలి బాధలు... వీటన్నింటినీ అధిగమించి ఉన్నత చదువుకు చేరుకునే సరికి తక్కువ కులం వారికి ఉన్నత చదువులేలా అన్న హేళనలు.. ఇవేవీ ఆమె జీవిత ఆశయానికి అడ్డురాలేదు. తాను అనుకున్నది సాధించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని జీవన పోరాటాన్ని సాగించింది. ఆమె ఆశయానికి తాతయ్య, మామయ్య (భర్త) తోడ్పాటు తోడవడంతో క్లిష్టతరమైన రసాయన శాస్త్రంలో డాక్టరేట్‌ను పూర్తి చేసింది. తన తాతయ్య సుంకన్న కోరిక, పేరును నిలబెట్టింది. 'చదువుకుని నా పేరు నిలబెట్టాలి బిడ్డా..' అని తాతయ్య ఎప్పుడూ అనేవాడు. ఈ రోజు ఆయన కల నిజం చేశాను' అంటూ భారతి చెబుతున్నప్పుడు ఆనందంతో ఆమె కళ్లు వర్షించాయి.
 

                                                          ఆడపిల్ల అన్న చీదరింపులు

అనంతపురం జిల్లా గుత్తి మండలం సూరసింగనపల్లి భారతి స్వస్థలం. 'మా అమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. మగపిల్లలు పుట్టలేదని చీదరింపు మాటలతో పాటు మద్యం సేవించి వచ్చి నాన్న అమ్మని తిట్టేవాడు, కొట్టేవాడు. అది చూడలేక మా తాతయ్య నన్ను ఇక్కడికి అంటే శింగనమల మండలం నాగులగూడెం గ్రామానికి తీసుకొచ్చారు. తాతయ్య ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. చదువు విలువ బాగా తెలుసు. అమ్మ పరిస్థితి ఇలా అయ్యిందని ఎప్పుడూ బాధపడేవాడు. అందుకే 'ఒక్క పాపనైనా బాగా చదివించి అమ్మాయిలంటే ఏమిటో మీ నాన్నకు చూపించాలి' అని అంటుండేవాడు' అంటూ తాతయ్య గురించి చెబుతున్నప్పుడు భారతి కళ్లు దు:ఖంతో వర్షించాయి.
         'ఎరుకుల తెగకు చెందిన మాలో ఆడపిల్లలను చదివించే వారే ఉండరు. ఎప్పుడు పెళ్లి చేద్దామా.. పంపించేద్దామా.. అన్నట్లు వుంటారు. పెళ్లయి ఆ బిడ్డ పడరాని పాట్లు పడుతున్నా పట్టించుకునే వారు కూడా ఉండరు. అటువంటి పరిస్థితిల్లో నాకు కూడా పదవ తగరతి పూర్తవుతూనే పెళ్లి చేశారు. వేరే వాళ్లకిచ్చి పెళ్లి చేస్తే వారు చదివిస్తారో లేదోనన్న ఉద్దేశంతో మా అమ్మ తన తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేశారు. తాతయ్య లక్ష్యానికి తోడు మా మామయ్య ప్రోత్సాహం కూడా ఉండబట్టే నేను ఇది సాధించాను. నా చదువు కోసం మామయ్య చాలా కష్టపడ్డాడు' అంటూ భర్త ఇచ్చిన మద్దతు గురించి ఆమె చెబుతోంది.
            రెక్కాడితేగాని డొక్కడని పరిస్థితిలో భర్త శివ ప్రసాద్‌ స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో దినసరి కూలీగా వెళుతున్నాడు. 'పదో తరగతిలో మా గ్రామం నుండి 40 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. భారతి ఒక్కటే మంచి మార్కులు సాధించింది. అప్పుడే అనుకున్నాను. ఈమె చాలా తెలివిగలది, చదివించాలని. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు మాన్పించలేదు. పగలు ఒక్కపూట పనికెళ్తే కుటుంబం గడిచేది కాదు. రాత్రుళ్లు కూడా పనిచేసేవాడ్ని. ఉండటానికి ఇల్లు లేని పరిస్థితిలో రేకులు, డేరాలు అడ్డుపెట్టుకునే ఉంటున్నాం. ఈ పేదరికం పోవాలంటే, మా పరిస్థితిలో మార్పు రావాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించాను. అందుకే భారతిని చదివించాను. పట్టుదలతో చదివి విజయం సాధించింది' అంటూ భార్య గొప్పతనాన్ని చెబుతున్నాడు ప్రసాద్‌.
భర్తతో పాటు భారతి కూడా వ్యవసాయ కూలీగా వెళ్లేది. భార్యాభర్త ఇద్దరు కష్టపడినా అరకొర ఆదాయమే వచ్చేది. పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బులు ఉండేవి కావు. పస్తులు పడుకునేవారు. ఇన్ని కష్టాలు పడుతున్న భారతిని చూసి తోటివారు 'నీకెందుకు ఈ చదువు. పెళ్లయినదానివి ఇవన్నీ అవసరమా? మొగుడు, బిడ్డతో హాయిగా ఉండక, ఎందుకీ అనవసర ప్రయత్నాలు' అని హేళన చేసేవారు. ఊళ్లోనే కాదు.. విశ్వవిద్యాలయంలో కూడా ఆమెకి జరిగిన అవమానాలు ఎన్నో ఉన్నాయి.
 

                                                     మీ మొహాలకు పిహెచ్‌డి కావాలా ?

ఇంటర్‌, డిగ్రీ, పీజీతో పాటు బియిడి కూడా చేసిన భారతి చదువు కోసం ఒక్కో రోజు ఒక్కో కష్టం పడింది. బస్సు చార్జీలకు డబ్బుల్లేక కిలోమీటర్ల దూరం నడిచేది. ఒక రోజు కూలికి వెళ్లి ఆ డబ్బులతో రెండో రోజు కాలేజీకి వెళ్లిన రోజులున్నాయి. పగలంతా పొలంలో పనిచేసి రాత్రుళ్లు చదువుకునేది. భర్త, బిడ్డ ఆలనాపాలనతో పాటు పశువుల పోషణ కూడా చేసేది. ఇన్ని కష్టాలు పడుతూనే పిహెచ్‌డి చేసేందుకు పరీక్ష రాసి భారతి ఉత్తీర్ణురాలైంది. అయితే 'పిహెచ్‌డిలో చేరడానికి వెళ్లిన నాకు కొంత మంది అధ్యాపకుల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి. మీ మొహాలకు పిహెచ్‌డి సీటు కావాలా..! అన్న మాటలకు దు:ఖం వచ్చింది. అయినా అర్హత ఉండి ఎందుకు సీటు ఇవ్వరంటూ మామయ్య నిరసన తెలియజేశాడు. ఇక సీటు ఇవ్వక తప్పదనుకున్న సమయంలో కొంత మంది వచ్చి రూ.50 వేలు డబ్బులిస్తాం, ఆ సీటు అడగవద్దన్న ఆఫర్‌ ఇచ్చారు. అయితే నాకు తెలుసు.. 'డబ్బులు కూలి పని చేసైనా సంపాదించుకోగలం.. చదువు డబ్బుతో రాదు కదా' అదే వారితో చెప్పి సీటు దక్కించుకున్నా.
 

                                                            విద్యాభ్యాసం ఇలా కొనసాగింది..

ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనూ, ఆరు నుంచి పదవ తరగతి వరకు శింగనమల మండలం కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువు పూర్తిచేసింది. పామిడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాక, గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ అనంతపురం ఎస్‌ఎస్‌బిఎన్‌లో చదివింది. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన 21వ స్నాతకోత్సవంలో రసాయన శాస్త్రంలో పిహెచ్‌డిని పూర్తి చేసి పట్టాను పొందింది.

                                                             అర్హతకు తగ్గ ఉద్యోగం కావాలి..

పిహెచ్‌డి పట్టా తీసుకున్న తరువాత కూడా భారతి కూలిపనులకు వెళ్తోంది. అర్హత గల ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. 'కష్టాలు నాకు కొత్త కాదు.. చదువు కోసం కష్టపడ్డాను. కానీ ఇప్పుడు ఉద్యోగం కోసం కూడా కష్టపడాల్సి వస్తోంది. ఉద్యోగం సాధించడం వల్ల నా వ్యక్తిగత జీవితం బాగుపడడమే కాదు, నాలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది' అంటున్న భారతి ప్రొఫెసర్‌ కావడమే తన జీవిత లక్ష్యమని, అది సాధించే వరకు మరింతగా కష్టపడటానికి కూడా సిద్ధంగానే ఉన్నానని బలమైన నమ్మకంతో చెబుతోంది.

- ఎ.షఫీఉల్లా,
ప్రజాశక్తి ప్రతినిధి,
అనంతపురం.