ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని
నిస్సిగ్గుతో పక్కకు నెట్టి
కామాంధుడి కోర్కెలు గుర్రమెక్కితే ...
నా పతకాలకి తొడిగే కనకం
శునక చేష్ట బుద్ధులకు అట్టుడికి
పాప పంకిలంతో మలినమైపోతుంది
ఒకప్పుడు విజయగర్వంతో ఉప్పొంగిన
ఈ జాతి జాతీయ పతాకం
నిజంగా సిగ్గుపడి తలదించుకోదా?
మల్ల యుద్ధంలో
ప్రపంచాన్ని ఓడించి
విశ్వవిజేతగా నిలిపినపుడు
ఈ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే
మమ్మల్ని యోధానుయోధురాలిగా
కీర్తించిన వాణ్ణి ఒక్కసారి ఈడ్చుకురండి
గౌరవానికి గౌను తొడిగి మరీ
ఈ క్రీడా పుత్రికను విజయ పతాకంతో
వినువీధుల్లో ఊరేగించారు
టపాసులు కాల్చి మరీ
స్వాగత సత్కారాలూ సన్మానాలూ
సంబరాలూ చేసినవాళ్ళని
ఒక్కసారి మా ముందుకి తీసుకురండి
ఒంటి చేతులతో
బంగారు పతకాన్ని తెచ్చి
భరతమాత మెడలో అలంకరించిన
ఈ పోరాట మల్ల యోధినులు
భరతగడ్డపై పుట్టిన మట్టిలో మాణిక్యాలు
కటిక నేలపై కఠోర దీక్ష చేస్తున్న చోటే
వాణ్ణి ఒక దోషిగా నిలబెట్టండి
లేదంటే ఒకప్పుడు
సగర్వంతో తలెత్తిన చోటే
ఇప్పుడు గర్వభంగమై
ఈ లోకం సిగ్గు పడుతుంది!
- రెడ్డి శంకరరావు
94943 33511










