నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (చీూణ) ప్రపంచంలోని అగ్రగామి థియేటర్ శిక్షణా సంస్థల్లో ఒకటి. దీనిని 1959లో న్యూ ఢిల్లీలో భారత ప్రభుత్వ సాంస్కతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ భారతీయ నాటకరంగానికి, ప్రపంచ నాటకరంగానికి గణనీయంగా ప్రాతినిధ్యం అందించింది. నసీరుద్దీన్ షా, ఓం పురి, అనుపమ్ ఖేర్, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధ్కీ వంటి ప్రముఖ భారతీయ చలనచిత్ర నటులు ఈ సంస్థ నుంచి రూపొందినవారే !
తెలుగు నాటకరంగం దాదాపు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి మూలాలను కలిగి ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. నేటికీ రాష్ట్రంలో నాటకరంగ కార్యకలాపాలు పుష్కలంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి సంస్థను స్థాపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది తెలుగు నాటకరంగానికి సహాయం చేయడమే కాకుండా రాష్ట్రంలో చాలా మంది కళాకారులకు జీవనోపాధిని కూడా సృష్టిస్తుంది. రాజమహేంద్రవరంలో ఎన్‌ఎస్‌డి ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, భారత ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపింది. ఆ సన్నాహాల్లో భాగంగా ఈనెల 19 నుంచి 23 వరకు రాజమహేంద్రవరంలో ఎన్‌ఎస్‌డి 22వ భారత్ రంగ్ మహౌత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా .. 19న సురభి వారి 'భక్త ప్రహ్లాద' నాటకం; 20న మంగుళూరు అస్థిత్వ థియేటర్ గ్రూప్ వారిచే 'కెండోనియన్స్' నాటకం; 21న అస్పోర్టివ్ థియేటర్ స్పేస్ గ్రూప్ ద్వారా, పాలక్కాడ్, కేరళ వారిచే 'లిబ్ (లెట్ ఇట్ బోదర్)' నాటకం; 22న బ్యాక్ ఆన్ స్టేజ్ థియేటర్ గ్రూప్, బెంగళూరు, కర్ణాటక వారిచే 'శ్మశాన కురుక్షేత్రం'; 23న మనలంగుడి థియేటర్ ల్యాండ్ గ్రూప్, కోవిల్‌పట్టి, తమిళనాడు వారిచే 'ఇడకిని కథయారథం' నాటకం ప్రదర్శిస్తున్నారు.
- ఆర్.మల్లికార్జున రావు,
సంచాలకులు, భాషా సాంస్క ృతిక శాఖ
94916 59899










