వర్షాకాలం వచ్చిందంటే చాలు ... మేమున్నామంటూ ఫ్లూ, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సీజనల్ వ్యాధుల్లో ఒకటి కండ్ల కలక. వర్షాకాలంలో కండ్లకలకతో పాటు కళ్లు పొడిబారడం, చికాకు, దురద సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో చాలాచోట్ల ఇప్పటికే కండ్లకలక ప్రబలి ఉంది.
కలక సోకితే కళ్ళు ఎర్రగా మారి వాపుతో ఇబ్బంది పెడుతుంటాయి. కళ్ళునొప్పితో పాటు కంటి నుంచి నీరు కారుతుంది. కండ్లకలక అనేది బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్. ఇది అంటువ్యాధి. కొద్దిరోజుల్లోనే బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కండ్ల కలక నుంచి రక్షించుకోవడానికి పరిశుభ్రత, జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు శుభ్రంగా లేకుండా కళ్ళను తాకకూడదని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. కండ్లకలకను 'పింక్ ఐ' అని కూడా పిలుస్తారు. ఇది కంటిలోని పొర (కంజక్టివా)కు ఇన్ఫెక్షన్ సోకి, దాని ఫలితంగా కలిగిన వాపు. కంజక్టివా అనేది కనురెప్పను, కళ్ళలోని తెల్లని భాగాన్ని కప్పి ఉంచే పారదర్శక పొర. కళ్ళ కలకలు ఇన్ఫెక్షన్ కారణంగా పారదర్శక పొర ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారడానికి కారణమవుతాయి.
నిర్లక్ష్యం చేయొద్దు
సాధారణ కండ్ల కలక వస్తే వారం పాటు ఇబ్బంది పెట్టిన తర్వాత తగ్గిపోతుంది. అదే వైరస్‌తో కండ్ల కలక వస్తే మూడు వారాల పాటు ఉండొచ్చు. నవజాత శిశువులు, నెలలోపున్న వారికి వస్తే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. తెల్లని పొర నుంచి కంటి గుడ్డు, కార్నియాకు విస్తరిస్తే చూపు మందగిస్తుంది. కార్నియాకు ఇన్‌ఫెక్షన్ సోకి అల్సర్ వచ్చే అవకాశమూ ఉంటుంది. రంధ్రాలు పడే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే చూపు కూడా పోయే అవకాశం ఉంది.
కంటి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. అధిక వర్షాలతో కంటి ఇన్ఫెక్షన్లు
కళ్లు శరీరానికి దీపాల వంటివి. వాటిని ఎల్లవేళల కాపాడుకోకపోతే దృష్టిలోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. సుదీర్ఘకాలంగా కురుస్తున్న వానల వల్ల కండ్లకలక (కంజెక్టివైటీస్) వంటి కంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్పల వెనుక ఉండే పొరలను కంజెటైవా అని అంటారు. కళ్లలోకి దుమ్ము, ధూళి, నీళ్ల వంటివి పడటంవల్ల కండ్ల కలకకు కారణమయ్యే ఇన్‌ఫెక్షన్ వల్ల బ్యాక్టీరియా, వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది.
స్వీయ వైద్యం వద్దు
కండ్ల కలక సమస్య తలెత్తితే.. స్వీయ వైద్యం చేసుకోవడం కంటి ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిదికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ఎక్కువగా సోకడం వల్ల కండ్ల కలక ఉన్న రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కండ్ల కలక రోగులను సాధారణంగా వారం రోజుల పాటు ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇతరులకు వ్యాప్తి చెందితే అది మూడు వారాలపాటు వేధిస్తుంది. కంటిలోపల ఉండే తెల్లని పొర నుంచి కంటి గుడ్డుకు వ్యాప్తిస్తే చూపు మందగించే ప్రమాదం ఉంది. ఒక్కోసారి కార్నియాకు రంధ్రాలు కూడా పడతాయి. అలాంటి పరిస్థితుల్లో కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కండ్లకలక లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని కంటి వైద్యుడి (ఆప్తమాలజిస్ట్)ని సంప్రదించాలి. ఐ డ్రాప్స్‌తో స్వీయ వైద్యం చేసుకోకూడదు. ఇలా చేస్తే కళ్లపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు చూపుతాయి.
తీసుకోవల్సిన జాగ్రత్తలు..
కండ్లకలక వచ్చినప్పుడు ఎట్టిపరిస్థితుల్లో కళ్లను నులమకూడదు. కంటి నుంచి నీళ్లు కారితే టిషఉ్యతో తుడిచి వెంటనే డస్ట్‌బిన్‌లో పారవేయండి.
కండ్లకలక ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తుంది. కళ్లను తాకి, ఆ చేత్తో ఇతరును తాకితే వెంటనే ఈ వ్యాధి వారికి కూడా వ్యాపిస్తుంది.
కండ్లకలకతో బాధపడే వ్యక్తులు కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి.
యాంటీ బయాటిక్ డ్రాప్స్ వాడాలి. నీళ్లతో తరచూ కళ్లను కడుగుతుంటే దురద అనిపించదు.
కండ్ల కలక లక్షణాలివే...
- కండ్లు ఎర్రబారుతాయి. కంట్లోంచి నీరు కారుతుంది. కంటి రెప్పలు ఉబ్బిపోతాయి.
- రాత్రి నిద్రపోయినపుడు అతుక్కొనిపోతాయి. పుసులు వస్తాయి.
- కొంతమందికి మందులు వాడకపోయినా వారంలో తగ్గిపోతుంది.
- కంటికి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి.
- కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది.
- కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు.

వైరస్‌తోనే కండ్ల కలక
సీజన్ మారే క్రమంలో వైరస్‌తో కండ్లకలక వస్తుంది. పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు. వస్తే కలిగించే బాధ అంతా ఇంతా కాదు. బయట గాలికి తిరగడానికి లేదు. ఇతరులతో మాట్లాడడానికి లేదు. అలా చేస్తే గాలి ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంది. అలాగే గాలి కారణంగా వ్యాధి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కండ్ల కలక ముఖ్యంగా వైరస్, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. దీంట్లో ముఖ్యంగా కళ్ళు బాగా ఎర్రబడి నీళ్ళు కారడం, కళ్ళమంటలు, కళ్ళలో పొడుచుకుంటున్నట్లుంది. బాధ, సరిగ్గా చూడలేకపోవడం ముఖ్య లక్షణాలు. ఇది ఒక అంటువ్యాధి, చేతి రుమాలు, తువ్వాలు ఒకళ్ళు వాడినవి ఇంకొకళ్ళు వాడడం, వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండడం వల్ల తొందరగా వస్తుంది. వ్యాధి సోకిన వారు గోరువెచ్చని నీళ్ళతో తరచూ కళ్ళు కడుగుతూ ఉండాలి. వీలైనంతవరకూ నల్లటి కళ్ళజోడు ధరించాలి. చేతి రుమాలు, టవల్‌ను ఇతరులని వాడనీయకూడదు. డాక్టరు సలహాపై కళ్ళలో మందు చుక్కలు వాడాలి.
జి.గీతాభాయి,
కృష్ణాజిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి, మచిలీపట్నం

కంటి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి
ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కండ్లకలక వ్యాధి సోకినా, లేకపోయినా, చేతులతో కళ్లను తాకకుండా ఉండాలి. కళ్ళను తాకాల్సివస్తే ఎల్లప్పుడూ ముందు, తరువాత చేతులను కడుక్కోవాలి. కళ్ళ నుంచి ఏదైనా నలుసులు లేదా చికాకును కలిగించే వాటిని శుభ్రపరచడానికి టిష్యూ కాగితాలను కూడా ఉపయోగించొచ్చు. కాంటాక్టు లెన్స్‌లు కళ్ళకు చికాకు కలిగిస్తాయి, ప్రత్యేకించి అవి ఎక్కువ కాలం ధరిస్తే కళ్లను రుద్దాలనే కోరికను సృష్టించొచ్చు. కాంటాక్ట్ లెన్సులు ఉపయోగించే వారైతే, కొంత కాలం పాటు కళ్లద్దాలు వాడండి. వైరస్ లేదా బ్యాక్టీరియా అనేది మీ కంజక్టివా ఉపరితలంపై నివసిస్తుంటే, మీ కనురెప్పలను శుభ్రం చేయడం ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియాను తీసివేయడంలో సహాయపడుతుంది. ఇది చికాకును కూడా తగ్గిస్తుంది. కళ్ళు వదులుగా తయారయ్యేలా చేస్తుంది.
డాక్టర్ సూరపనేని ప్రవీణ్,
కంటి వైద్యనిపుణులు, ఉదయనేత కంటివైద్యశాల, విజయవాడ










