Nov 07,2022 07:02

రంగుల ఆనవాళ్ళల్లో పొరలు పొరలుగా
నువ్వు నిర్మించబడి ఉన్న సంగతి మరిచి
రంగులేని నవ్వు నవ్వుతావేం?
జీవపు రంగున్న నవ్వులు ఎక్కడ దాచిపెట్టావ్‌?
నీ అసలుకిపోయి వెదికినప్పుడు జాలువారే
సీతాకోకలు ఇప్పుడు ఏవీ?

ఓయీ నిత్య సంఘర్షీ.. కృత్రిమ మెరుపులకి
అసలు రంగులు వెచ్చించేసావ్‌ కదా!
గాలి రంగు, ప్రాణం రంగు,
మనసు రంగు, హృదయం రంగు
ఆఖరుకి శరీరం రంగూనూ ...
ఆలోచనల నిజ రంగంతా పోయి
మెదడుని కృత్రిమం ఎలా చేసేసావ్‌!

కోయిల పాటలకి తడబడుతున్నావ్‌
అరువు కోయిల కాదూ అని ఒకింత
మనసు స్పందించటం లేదా?
హృదయానికి చెవులు పుట్టే ప్రతిసారీ
సహజత్వాన్ని కాల్చేసే
రక్తం చిందే పిడుగులు కురిసే వాననే నమ్ముతావ్‌!

మనిషన్న నమ్మకం మానవత్వపు సెగపై
ఉడికి చిమిడిపోయింది, చూసావా..!
ఎన్ని రంగుల్ని కనాలో ఇప్పుడు ...
మెదడుకి సంకేతాలివ్వమని
కృత్రిమ యంత్రానికి చెప్పాలిప్పుడు ...
మనిషిగా మరణించి చాలా కాలమైంది, తెలుసుగా
నేనూ నువ్వూ మనం అన్న నిజం
చిటారు కొమ్మన రెపరెపలాడే చిన్న ఆశే ఇప్పుడు

అసహన హృదయ చప్పుళ్ళూ..
ఆర్తిని కోల్పోయిన మస్తిష్కపు నవ్వులూ..

ఇప్పుడు చిరు దివిటీల్లాంటి పసిబుగ్గలు
గులాబీల్ని పూయించట్లేదు
ప్రశ్నల సున్నితత్వం తుంచబడింది!
ప్రపంచమంతా ఆకాశానికి వలసపోవడానికి
ప్రాణం పోయే మార్గం తవ్వుతున్నారో ఏమో!
ప్రాణాలు రంగుల్లో కలిసిపోతున్నాయి
నిజ ప్రాణాలనే మాట మరిచి మిగిలినవాళ్ళు
కృత్రిమ చోద్యం చూస్తున్నారల్లే ఉంది

రేపటి వంతు మనదే ...
ఈరోజే కొన్ని రంగునీళ్ళు చల్లుకోవాలి!

- అనూరాధ