- ఉష్ణోగ్రతలా? కార్పొరేట్లే తగలబెడుతున్నారా..?
- నాసా చిత్రాల్లో వెయ్యి ప్రాంతాలకు పైగా మంటల్లో అడవులు
న్యూఢిల్లీ : అడవులు బాగుంటేనే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పెరిగిపోతున్న జనావాసాలు.. కార్పొరేట్లకు కావాల్సిన సంపద కోసం పచ్చటి అడవులు కాస్త కరిగిపోతున్నాయి. అటవీ ప్రాంతాల్లో పాలకులు, కార్పొరేట్లతో కుమ్మక్కవ్వటం వల్లే అటవీ సంపద బడా పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి వెళ్లి పోతోంది. అడవుల్లో ఉండాల్సిన ఆదివాసీలు, జంతువులేమో కాంక్రీట్ జంగిల్ వైపు చూస్తున్నాయి.
ఇంతకీ నాసా రిపోర్టులో ఏమున్నది..?
భారతదేశంలో ఒక వారంలో వెయ్యికి పైగా అడవి మంటలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడంతో, భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో.. కేవలం వారం రోజుల్లోనే 1,156 అడవి మంటలు సంభవించాయి,. గాలి నాణ్యత సూచిక గణనీయంగా తగ్గిందని చెబుతున్నా.. దీనివెనుక గద్దల్లాంటి కార్పొరేట్లు ఉన్నారన్నది నిర్వివాదాంశం.గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ రాజస్థాన్, గోవా, కోస్తా కర్నాటకతోపాటు మరి కొన్ని రాష్ట్రాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి.అడవుల్లోకి వెళ్లాలంటే.. కొన్ని మార్గదర్శకాలు, నిబంధనలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక అడవులను విచ్చలవిడిగా కార్పొరేటర్లకు ధారాదత్తం చేస్తోంది. అందుకు వీలుగా జీవోలను మార్చేస్తోంది. ఈ నేపథ్యంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న మైనింగ్ సంపదను ఇష్టానుసారంగా తవ్వుకోవటానికి అనుమతులివ్వటమే ఇప్పుడీ అడవుల దహనానికి కారణమన్న చర్చ నడుస్తోంది.
అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనవాసాల్లోకి...
అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు, పులులు, సింహాలు మైనింగ్ మాఫియా దెబ్బకు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జార్ఖండ్ లో 12 ఏళ్లలో సుమారు 900 మంది ఏనుగుల దాడిలో చనిపోయారంటే నమ్ముతారా..కానీ ఇది నిజం.
ఏనుగు కారిడార్‌ల భాగాలు మూడు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిషా , ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళుతున్నాయి. వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క 2017 నివేదిక ''రైట్ టు పాసేజ్ ఏనుగు కారిడార్ల చుట్టూ పెరుగుతున్న సంఘర్షణ సమస్యను హైలైట్ చేస్తోంది.
నివేదిక ప్రకారం, దక్షిణ పశ్చిమ బెంగాల్‌తో పాటు పక్కనే ఉన్న ఈ మూడు రాష్ట్రాలను కవర్ చేసే మొత్తం 21,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఏనుగులు ప్రధానంగా తిరుగుతాయి. 2017 ఏనుగుల గణన ప్రకారం ఈ ప్రాంతంలో 3,128 ఏనుగులు నమోదయ్యాయి. ఇది దేశంలోని ఏనుగుల జనాభాలో కేవలం 10% మాత్రమే. అయినా ఏనుగులతో జరిగిన ఘర్షణలో 45% మానవ మరణాలు ఈ ప్రాంతం నుంచే నమోదు కావటం విశేషం.
ఉత్తర భారతదేశంలో ఏనుగులకు జార్ఖండ్ హాట్‌స్పాట్. గత దశాబ్దంలో, క్రమబద్ధీకరించని బొగ్గు అక్రమ మైనింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏనుగుల స్వేచ్ఛా సంచారానికి కొత్త సవాళ్లను విసురుతోంది.
రాంచీ యూనివర్సిటీలో పర్యావరణవేత్త , జియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ నితీశ్ ప్రియదర్శి మాట్లాడుతూ... ''హజారీబాగ్, ధన్‌బాద్ , బొకారో వంటి జిల్లాలు సెంట్రల్ జార్ఖండ్ ప్రాంతంలోకి వస్తాయి, ఇక్కడ బొగ్గు మైనింగ్ ప్రబలంగా ఉన్నది . ఇది ఏనుగులకు హాని కలిగిస్తుంది.'' అని వివరించారు.అవిభక్త బీహార్‌లోని రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సభ్యుడిగా ఉన్న దయాశంకర్ శ్రీవాస్తవ కూడా దీన్ని ధ్రువీకరించారు. పాలమూలో ఉన్న శ్రీవాస్తవ మాట్లాడుతూ, ''నియంత్రణ లేని మైనింగ్ కార్యకలాపాల కారణంగానే మా ఏనుగులు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కు చేరుకుంటున్నాయి.'' అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆన్ని రాష్ట్రాల్లోనూ మైనింగ్‌కు పాల్పడుతుండటంతో.. జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ యొక్క 15వ స్టీరింగ్ కమిటీ (నవంబర్ 22, 2018) ఒక నివేదికను తయారుచేసింది. ఏనుగును సంరక్షించటానికి రాష్ట్రాలు కారిడార్‌ల ఏర్పాటు గురించి తెలియజేయాలనీ, పర్యావరణ (రక్షణ) చట్టం 1986 ప్రకారం పర్యావరణ సెన్సిటివ్ జోన్‌ల హోదాను లేదా కమ్యూనిటీ రిజర్వ్‌గా ఇవ్వాలని కోరింది. 1972 వన్యప్రాణుల (రక్షణ) చట్టం ప్రకారం.. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఇటువంటి 101 ఏనుగు కారిడార్లను మ్యాప్ చేసింది. కానీ ప్రయోజనం శూన్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.పచ్చటి అడవులు ఉష్ణోగ్రతల కారణంగా తగలబడుతున్నవి కొన్నైతే.. అడ్డదిడ్డమైన అక్రమమైనింగ్ వల్ల కార్పొరేట్ల చేతుల్లో కాలి బూడిదవుతున్నవే అనేకం ఉన్నాయి .. వందలు కాదు వేల ఎకరాల్లో ఉన్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే తీరున అడవులను నరకడం, దహించడం లాంటివి కొనసాగితే..... పర్యావరణానికే కాదు మానవ మనుగడకే ప్రమాదమనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. చివరికి అడవులను కోల్పోతే భవిష్యత్తులో జంతువులను బోన్లలోనో.. జూలలోనే చూసుకునే పరిస్థితులు దాపురించవచ్చు..










