బడ్జెట్ కి ముందు రోజు రాత్రి
ప్రతిపక్ష నాయకుడు కనబడి
డెబ్భై ఏళ్ల గా చెప్పే మాటే
అంకెల గారడీ అని గట్టిగా చెవుల్లో అరిచాడు
ఒక స్త్రీ నాయకి స్వరం
ప్రజా వ్యతిరేకం అని
అప్పుడెప్పుడో ఆర్థిక శాఖను
ఉద్ధరించిన నోరొకటి
ఇది క్రూర బడ్జెట్ అని ..
పాలక పక్షం నాయకుడొకడు
అమృతోత్సవ బడ్జెట్ అని
గాల్లో చేతులుపుతూ,
నా కంటి ముందు అంకెలు పోశారు
ఎద్దు ఎలుగుబంటి
పరుగుపందెం లో పాదాల కింద పడి
విరిగిన సన్నకారు జీవుల బొమికల శబ్దాలు
పకపకా నవ్వుతున్న కార్పొరేట్ వ్యాపారి
ద్ణుఖాన్ని మొలిపిస్తూ కిరీటం లేని రైతు
సెలైన్ పెట్టుకున్న పెద్దాసుపత్రి
ఉక్కపోతతో ఉడుకుతున్న విశాఖ ఉక్కు
ఇప్పుడు నా ముక్కుపూటాలకు
మధ్య తరగతి ఆశల
కుళ్ళిన గుమ్మడి పండు వాసన తగుల్తోంది
నా గుండెల్లో
పగులుతున్న పేదల గుండె చప్పుళ్ళు
ఖాళీ బిందెలు కార్చే కన్నీళ్లు
చెట్టు కిందే సంసారం చేస్తు
నా వైపు దీనంగా చూస్తున్న యానాది చెంచయ్య
ఓ కవీ ..,
నీ వాక్యం నుంచి ఇల్లు నిర్మించు
నీ పదాల నుంచి నీళ్లు పుట్టించు
నీ వాక్యాలు
బడ్జెట్ లాంటివే అంటూ
హెచ్చరిక బోర్డొకటి
నా ఇంటి ముందు నాటేసి
పరుగెడుతున్న జనం కన్పించారు!
- డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547










