ఒకప్పుడు ఇలాంటి వర్షాకాలం వచ్చిందంటే- పొలాల్లో ఎద్దులు పూన్చిన నాగళ్లు హల్‌చల్ చేసేవి. పంటలు వేయటానికి నేలను సిద్ధం చేసేవి. అలాగే, పొలాన పండిన పంటను ఎడ్లబళ్లు ఇళ్లకు, మార్కెట్లకు తరలించేవి. వ్యవసాయంలో కీలకపాత్ర పోషించిన ఎడ్లు, ఎడ్ల బళ్లు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. అయితే, ఆ ఎడ్లను, ఎడ్లబళ్లను మన కళ్లముందు సజీవ రూపాలుగా నిలుపుతున్నారు రహంతుల్లా. అచ్చమైన టేకుతో అతడు రూపొందిస్తున్న ఈ కళారూపాలు ఇప్పుడు గొప్ప ఆదరణ పొందుతున్నాయి.
తాత ఇస్మాయిల్ స్ఫూర్తితో ...
ఆకలి కష్ట పడటాన్ని అలవాటు చేస్తుంది. ఆలోచన బతకటాన్ని నేర్పిస్తుంది. లక్ష్యం జీవితాన్ని విజయపథాన నడిపిస్తుంది. ఇందుకు వండ్రంగి పనిచేసే రహంతుల్లాఖాన్ జీవితం నిదర్శనం. తాను ఎన్నో కష్టాలు.. మరెన్నో బాధలు వాటిని మనసులో దిగమింగుకున్నారు. విజయం కావాలంటే గమనం మార్చుకోవాల్సిందేనని భావించారు. గృహాలంకరణకు ఉపయోగించే వస్తువులను తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరుకు చెందిన రహుంతుల్లా ఖాన్ తొమ్మిదో తరగతి వరకూ మాత్రమే చదివారు. తల్లిదండ్రులు ఆయూన్‌ఖాన్, అఫ్రిన్నీసా. తండ్రి టైలరింగ్ వృత్తిలోనూ, తల్లి గృహిణిగా ఉన్నారు. రహంతుల్లాఖాన్‌కు ముగ్గురు అన్నతమ్ముళు, ఇద్దరు సోదరీమణులు.
కలిదిండి మండలం కోట కలిదిండి అమ్మమ్మ ఊరు. రహంతుల్లా విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఆరుగురుతో సంసారాన్ని ఈదటం తల్లిదండ్రులకు భారంగా ఉందని భావించిన రహంతుల్లాఖాన్ జీవితంలో ఎదగాలంటే తను కొత్తగా ఏదో ఒకటి చేయాలని భావించి 'ఎద్దులబండి' బొమ్మలను గీయాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు.
తాత బాటకు ఆధునికత జోడిండి ...
రహుంతుల్లా తొమ్మిదో తరగతి అయ్యాక చదువు ఇక ముందుకు సాగదని భావించాడు. చదువుకు స్వస్తిచెప్పి తాత మహమ్మద్ ఇస్మాయిల్ బాటలో (ఆయన నాటు ఎడ్లబళ్లుతయారు చేసేవారు) పయనిస్తూ అలంకరణలో ఆకర్షణీయంగా ఉండే గృహోపకరణాలను తయారు చేయటం మొదలు పెట్టాడు. టేకు కలపకు తుది మెరుగులు దిద్ది పాలిష్‌తో అద్భుతాలు సృష్టించాడు. మొదట్లో ఆర్థిక ఇబ్బందులు తాండవ నాట్యం చేశాయి. అప్పులు చేసి తన వృత్తికి అవసరమైన పనిముట్లు, యంత్ర సామగ్రి కొనుగోలు చేశారు. దుకాణాన్ని బాడుగకు తీసుకున్నారు. ఎంతో ఓపికతో నిత్య నూతనంగా పనిచేస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉండే చెక్క పనిముట్లు తయారు చేస్తున్నారు. ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్ టేబుళ్లు, మంచాలు, వ్యవసాయానికి కావాల్సిన నాగలి, కాడిమేడి, బండి ... ఇలా రకరకాల వస్తువులు తయారుచేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఎడ్లబళ్లకు మంచి గిరాకీ
రహంతుల్లా బొమ్మలు సృజనాత్మకతకు ప్రతిరూపంగా నిలుస్తుండటంతో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, ఆఫీసులు, పెద్ద కార్యాలయాల్లో టీపాయిలు, షోకేసుల్లో పెట్టుకోవటానికి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇళ్లల్లో వాడుకోవడానికి వస్తువులన్నీ టేకుతో చేసినవే దొరికేవి. మళ్లీ పాత రోజులను గుర్తుకు తేస్తూ వాటిని తయారు చేస్తున్నారు రహంతుల్లాఖాన్. పనితనానికి నైపుణ్యం జోడించి ఆధునికతకు అద్దం పట్టే విధంగా వివిధ కళాకృతులు నచ్చే విధంగా తయారు చేస్తుండటంతో అందరినీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి.
ఆరేళ్ల శిక్షణతో నైపుణ్యం
రహంతుల్లా ప్రారంభంలో కైకలూరులో రాజులపూడి నాగరాజు వద్ద ఆరేళ్లపాటు వడ్రంగి పనిలో శిక్షణ పొందారు. వినియోగించే ఎడ్ల బండ్లు, మంచాలు, కుర్చీలు, డ్రైనింగ్ టేబుళ్లు వంటివి తయారు చేయడం నేర్చుకున్నాడు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎడ్ల బండి తయారీ కార్పెంటరీ షాపులు లేవు. రహంతుల్లాఖాన్ ఇది తెలుసుకుని కాళ్ళకూరులో కార్పెంటరీ షాపు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడే తాను తయారు చేసిన రకరకాల వస్తువులను విక్రయిస్తున్నారు. వ్యవసాయం, ఆక్వా రైతులు, ఇంతకుముందు ఎడ్ల బండి వాడే రైతులు కూడా ఎడ్లబండ్ల బొమ్మలను చూసి కొనుగోలు చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్లు, ఇతర శుభకార్యాలు, దుకాణాల ప్రారంభం తదితర సందర్భాల్లో బహుమతులుగా ఈ బొమ్మలను పంపుతున్నారని రహంతుల్లా ఖాన్ తెలిపారు.
ఆర్డర్లపైనా తయారీ..
సైజును బట్టి, పనితనాన్ని బట్టి ఈ ఎండ్ల బండి ధర పలుకుతుంది. టేకుతో తయారుచేసిన ఎడ్ల బండి చిన్న సైజులో రూ.7000, పెద్దది రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. రోజ్‌వుడ్‌తో తయారుచేసిన చిన్నఎడ్ల బండి రూ 14 వేలు, పెద్ద ఎడ్ల బండి రూ 45 వేల ధర పలుకుతోంది. టీపారు టేకుతో అయితే రూ.30 వేలు, రోజ్‌వుడ్‌తో తయారుచేసిన రూ.45 వేలు చొప్పున ఆర్డర్లపై తయారుచేసి విక్రయిస్తున్నారు. చాలామంది రైతులు ఇళ్లల్లో, అపార్ట్‌మెంట్లల్లో టేకు, రోజువుడ్‌తో తయారుచేసిన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. టేకు, రోజ:్‌వుడ్‌లతో తయారు చేసిన ఎడ్లబండ్లు ఆకర్షణంగా ఉంటున్నాయి. వాటికి మంచి గిరాకీ లబిస్తోంది.
- గొట్టేటి శ్రీనివాసులు,
9397139966,
కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా,

నలుగురు మెచ్చుకునేలా జీవిస్తున్నా ...
కైకలూరులో రాజులపూడి నాగరాజు వద్ద వడ్రంగి పని నేర్చుకున్నాను. చెక్కతో ఆకృతులు చేయడం అంత సులభం కాదు. నేర్చుకోవడానికి ఓపిక, పట్టుదల కావాలి. ప్రస్తుతం ఈ వృత్తిలో కూడా యాంత్రీకరణ వినియోగం పెరిగింది. కొన్ని పనులు చేతితో మరికొన్ని పనులు యంత్రాలతో చేస్తాను. కాలం మారడంతో చాలామంది వడ్రంగి పనిచేసేవారు ఉపాధి కోసం వేరే ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ పనులు చేతితో చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. ఈ పని నేర్చుకునే వారు కూడా అరుదు. వేరే పని చేయలేక ఈ వృత్తినే నమ్ముకున్నా. రోజుకి ఎనిమిది గంటలు పనిలో నిమగమై తయారు చేస్తున్నా. తాత నాటు ఎడ్లబండ్లు తయారుచేసేవారు. నేను టేకు కలపతో ఎద్దుల బండ్లు తయారుచేస్తున్నా. ఉత్పత్తులకు మంచి గిరాకీ మార్కెట్లో ఉంటోంది.
- రహంతుల్లా ఖాన్,
వడ్రంగి, కాళ్లకూరు.










