ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, జోడుగుళ్ళు పాలెంలో ఉదయం 6 గంటల నుండి 7.30గంటల వరకు బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గత సంవత్సర కాలంగా విశాఖ జిల్లా రోజు రోజుకు అభివద్ధి చెందుతోందని, భవిష్యత్తులో జిల్లా ప్రాముఖ్యత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిని ద్రుష్టిలో పెట్టుకొని శానిటేషన్ కు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 11 విడతల బీచ్ క్లీన్ కార్యక్రమం నిర్వహించి 258 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్ధాలు సేకరించి రిసైకిల్ బిన్ కు తరలించడం జరిగిందన్నారు. ప్రతిరోజు టూరిస్టులు విశాఖలోని వివిధ బీచ్ ప్రాంతాల్లో సందర్శిస్తుంటూరని, వారు కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగించకుండా సహకరిస్తున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం మరియు శానిటేషన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఇంకా పెంచాల్సిన అవసరముందన్నారు. ప్లాస్టిక్ మరియు చెత్తను డస్ట్ బిన్ లలో వేసి సహకరించాలని పర్యాటకులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్, జివిఎంసి కమిషనర్ సియం సాయి కాంత్ వర్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగదీశ్వర రావు, రెవెన్యూ , జివిఎంసి, వైద్య, వి ఎమ్ ఆర్ డి ఏ, విద్య, ఫారెస్ట్ శాఖల సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు,హాజరయ్యారు.