Jul 16,2023 06:45

కొద్ది రోజులుగా రాష్ట్రంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు సైతం కాస్తున్నాయి. ఈ భిన్న పరిణామాలతో ప్రజానీకం వివిధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో కల్తీ ఆహారం, తాగునీరు, మురుగు, దోమలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఈ వ్యాధుల నియంత్రణకు మార్గం.
వేసవిలో ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలు తొలకరి వర్షాలతో ఉపశమనం పొందుతారు. వర్షాకాలం ఎంత ఆహ్లాదాన్నిస్తుందో అంతే ప్రమాదకరం కూడా! వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే.. రోగాలు దాడి చేస్తాయి. మలేరియా, టైఫాయిడ్‌, కలరా వంటి సీజనల్‌ వ్యాధులు వేధిస్తాయి. ఈ సీజన్‌లో పిల్లల నుంచి పెద్దల వరకూ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి. సాధారణంగా వర్షంలో తడిస్తే చిన్నారులు రొంప, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు.

వ్యాధుల వాహకాలుగా దోమలు

2

వర్షాలకు విజృంభిస్తున్న దోమలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాల్వల్లో పేరుకున్న మురుగు, నిల్వనీరు దోమలకు ఆవాసంగా మారతాయి. దోమల కారణంగా మలేరియా, చికున్‌ గున్యా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ ఉధృతి కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కాకినాడ, మచిలీపట్నం నగరాల్లో డెంగ్యూ కేసులు ఏటేటా నమోదవుతున్నాయి. మలేరియా అనాఫిలిస్‌ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. కుట్టిన దోమలో ప్లాస్మోడియం పరాన్న జీవి ఉంటే మలేరియా వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. సెరిబ్రల్‌ మలేరియాకు దారి తీయొచ్చు. ఇది ప్రాణాంతక పరిస్థితి. మూర్ఛలు, మూత్రపిండాల వైఫల్యం, కామెర్లు, శ్వాసకోశ రుగ్మతలకు దారి తీస్తుంది. అధిక తేమ, ఉష్ణోగ్రత మార్పులు ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తికి అనువుగా ఉంటుంది. ఇన్‌ఫ్లుయెంజా ఈ వైరస్‌ సోకినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, ముక్కు కారడం, అలసట, విరేచనాలు, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. న్యుమోనియా, ఉబ్బసం, డయాబెటిస్‌, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.

వివిధ వ్యాధులు - వాటి లక్షణాలు

3

మలేరియా : మురుగు లేదా నిల్వ ఉండే నీటిలో ఏర్పడే ఆడ అనోఫెల్స్‌ దోమ వల్ల ఏర్పడుతుంది.
లక్షణాలు : చలి, జ్వరం, కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పులు, అతిగా చెమట పట్టడం
దగ్గు, వైరల్‌ ఫీవర్‌ : ఇది అంటు వ్యాధి. ఎక్కువ సేపు వర్షంలో తడిచినా, తడిచిన బట్టల్లో ఉన్నా ఏర్పడుతుంది
లక్షణాలు : గొంతునొప్పి, కండరాల నొప్పులు, ఆయాసం, ముక్కుకారడం
డయేరియా : కలుషిత ఆహారం లేదా నీరు వల్ల వస్తుంది.
లక్షణాలు : ఆయాసం, తిమ్మిరులు, వాంతులు, నీరసం, అలసట
టైఫాయిడ్‌ : కలుషిత నీరు, లేదా ఆహారం వల్ల వస్తోంది
లక్షణాలు : తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం
లెప్టోస్పిరోసిస్‌ : శరీరంపై గాయాలున్న వారు మురుగునీటిలో నడిస్తే వస్తుంది.
లక్షణాలు : తలనొప్పి, కళ్ల నొప్పి, శరీరం బిగుతుగా అనిపించటం, జ్వరం
మనం తాగే నీటి ద్వారానే 40 శాతం వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగితే చాలా వరకూ వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి 

  1. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకూడదు
  2.  దోమలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి
  3.  నిండుగా దుస్తులు ధరించాలి
  4.  స్వచ్ఛమైన, ఫిల్టర్‌ చేసిన, కాచి చల్లార్చిన నీరే తాగాలి.
  5.  రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.
  6.  తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకోవాలి.
  7.  జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్‌ కచ్చితంగా వాడాలి.

అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్‌ మమత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కపిలేశ్వరపురం, కృష్ణాజిల్లా

2

వివిధ సీజన్లలో వచ్చే వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పరిసరాల పరిశుభ్రతతో పాటుగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంటు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల లార్వా పెరగకుండా మలాథీయాన్‌ స్ప్రే చేయించాలి. ఇళ్లల్లో దోమలు కుట్టకుండా తెరలు వాడాలి. గదులను గాలి, వెలుతురు ఉండే విధంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి.

వేడి ఆహార పదార్థాలనే తీసుకోవాలి : డాక్టర్‌ గులాబ్‌రాజ్‌ కుమార్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాళ్ల, పశ్చిమ గోదావరి 

gulab

ప్రతిఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే తాగాలి. వేడి ఆహార పదార్థాలను తినటం మంచిది. స్ట్రీట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బయట ఆహారం తినటం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్‌ (గ్యాస్ట్రో ఎన్టీరైటిస్‌) వంటివి వస్తుంటాయి. కడుపులో ఇన్పెక్షన్లు కలుగుతాయి. జీర్ణాశయ గోడలు (లైనింగ్‌), పొట్ట, ప్రేగుల వాపునకు దారితీస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. కాలువల్లో ఆయిల్‌బాల్స్‌, మలాథీయాన్‌, బయోటెక్స్‌ వంటి వాటిని చల్లించాలి. తరచూ బ్లీచింగ్‌ చల్లించటం మంచిది. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను శుభ్రం చేయించుకోవాలి. రక్షిత మంచినీటినే తాగాలి.