Jun 30,2023 08:17

కుండపోతగా వర్షాలు పడినప్పుడు వీధులన్నీ జలమయం అవుతాయి. నాళాలు పొంగిపొర్లుతుంటాయి. ఈ సమయంలో వాహనదారులు చాలా జాగ్రత్తలు ప్రయాణించాలి. రోడ్ల మీద నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల బైక్‌ జారి కింద పడే అవకాశం ఉంటుంది.. అందుకే వర్షాలు రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాలను తగ్గించవచ్చు.
వర్షాకాలం రాకముందే వాహనాలను చెక్‌ చేయించాలి. ఏదైనా లోపాలు ఉంటే సర్వీసు చేయించాలి.
పాత టైర్లు అరిగిపోయినట్లయితే వెంటనే మార్పించుకోవాలి. అలా చెయ్యకపోతే టైర్లకు పంక్చర్‌ అవుతుంది. నీళ్లల్లో వెళ్లేటప్పుడు పాత టైర్లు పట్టును కోల్పోయి స్కిడ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇండికేటర్‌ పనితీరును కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇతరత్రా ఏదేని మరమ్మతులు ఉన్నా వెంటనే చేయించుకోవాలి.
వర్షం కారణంగా చీకటిగా ఉంటుంది. హెడ్‌ లైట్‌, టెయిల్‌ లైట్లు పనిచేయకపోతే ఇలాంటి సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లైట్ల పనితీరును పరిశీలించుకుని కొత్తవి అమర్చుకోవాలి.
అలాగే బ్రేక్లను చెక్‌ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి బ్రేక్‌లు గట్టిగా బిగుసుకుపోయి బైక్‌ సమయానికి ఆగదు. దీనివల్ల కూడా బైక్‌ స్కిడ్‌ అవుతూ ఉంటుంది. కాబట్టి బైక్‌ సర్వీసింగ్‌ చేయించుకోవడం మంచిది.
హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. రోడ్లపై నీళ్లు, తడిగా ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి హెల్మెట్‌ ఉంటే ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు.