Aug 26,2023 16:15

ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు) : సీజనల్‌ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి ఇంచార్జ్‌ డిప్యూటి డి.ఎమ్‌.అండ్‌.హెచ్‌.ఓ ఎన్‌.నాగేశ్వరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశం ఉందని సిబ్బంది వాటిపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సిబ్బంది గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ప్రజలకు అవగాహనా కల్పించాలని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు దోమ తెరలను వడాలని ప్రజలకు సూచించారు. పి హెచ్‌ సి పరిధిలో కొన్ని చోట్ల అనుమానస్పద డెంగీ కేసులు నమోదు అవుతున్నయని అటువంటి గ్రామాలలో పారిశుధ్య పనులను చేపట్టాలని సూచించారు. పిహెచ్‌సిలలో మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలకు ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం మందులు కూడ పిహెచ్‌సిలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా 10 నుంచి 18 సంవత్సరాల లోపు రక్త హీనత కలిగిన పిల్లలను గుర్తించి వారికి సరైన మందులు, పోషకాహారం అందించెల చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి గాను పాఠశాలలు, కళాశాలలలోకి వెళ్లి రక్త హీనత కలిగిన పిల్లలను గుర్తించి వారికి సరైన సమయంలో చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని గాయత్రి, ఫార్మసిస్ట్‌ నాగేశ్వరరావు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.