Jul 08,2023 06:39

చెట్టే నీ తోడు
చెట్టే నీ గూడు
చెట్టును పోషించకుంటె
బ్రతుకంతా గోడు!

చెట్టే నీ నీడ
చెట్టే నీ వాడ
చెట్టును పోషించకుంటె
పడుతుందట చీడ!

చెట్టే నీ నాడి
చెట్టే నీ మేడి
చెట్టును పోషించకుంటె
పుట్టదు గద పాడి!

చెట్టే నీ ప్రాణం
చెట్టే నీ బాణం
చెట్టును పోషించకుంటె
తప్పదుగద మరణం!

చెట్టే నీ హితుడు
చెట్టేనీ గురుడు
చెట్టును పోషించకుంటె
బ్రతుక గలడె నరుడు!

చెట్టే నీతల్లి
చెట్టు కల్పవల్లి
చెట్టును పోషించకుంటె
ఏడుస్తావ్‌ కుళ్ళి!

చెట్టే నీ గొడుగు
చెట్టే నీ తొడుగు
చెట్టును పోషించకుంటె
నీవె ఒక వెడగు!

చెట్టే నీ పడక
చెట్టే నీ తడక
చెట్టును పోషించకుంటె
సాగదు నీ నడక

చెట్టే నీ కులము
చెట్టే నీ మతము
చెట్టును పోషించకుంటే
లేదు భావి కాలము!

చెట్టే నీ దళము
చెట్టే నీ బలము
చెట్టును పోషించకుంటె
పలకదు నీ గళము!

- కిలపర్తి దాలినాయుడు
సాలూరు