ట్రాఫిక్ పోలీసుగా సిగ్నల్స్ జంప్ చేసి వెళ్లే మోటారు వాహనాలు అతని దృష్టి నుండి తప్పించుకోలేవు. అనుక్షణం అప్రమత్తతతో ఉండి విధులు నిర్వర్తించే ఆ పోలీసు పేరు ప్రశంజిత్ చటర్జీ. కలకత్తా సౌత్‌వెస్ట్ ట్రాఫిక్ గార్డ్ ఇన్‌చార్జ్ ఆఫీసరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పనివేళలు ముగిసిన తరువాత కూడా అతను అంతే జాగరూకతతో సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తించడంలో నిమగమైపోతున్నాడు. రైల్వే ట్రాకు వెంబడి ఒక పరదా వేసుకుని 30 నుండి 40 మంది పిల్లలు ప్రతి రోజూ అక్కడికి చేరుకుంటారు. అదొక ట్యూషన్ సెంటర్. దాని నిర్వాహకులంతా ట్రాఫిక్ పోలీసులే. ప్రశంజిత్ చొరవ వల్లే వారంతా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమయ్యారు. కలకత్తా రాజధానికి దక్షిణాన మజర్‌హట్ రైల్వే స్టేషను ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ బస్తీ ఉంది. అక్కడి ప్రజల్లో చాలామంది దినసరి కూలీలే. పురుషులు ఆటోలు, రిక్షాలు నడుపుకుంటూ, మహిళలు ఇంటిపనులకు వెళ్తూ జీవిస్తారు. ఆ కుటుంబాల పిల్లలకు చదువు పెద్ద గుదిబండ. చాలా ఇళ్లల్లో పిల్లలు స్కూలుకు దూరమయ్యారు. అలా 3వ తరగతి, 4వ తరగతితో చదువు ఆపేసిన పిల్లలను ప్రశంజిత్ చాలాసార్లు గమనించారు. 'ఒకసారి నేను ఆ మురికివాడ వైపు వెళ్లాను. ఆ రోజు ఆగష్టు 11 నాకు బాగా గుర్తుంది. బస్తీకి వెళ్లేసరికి అక్కడ స్కూలుకు వెళ్లే అబ్బాయిల గుంపు ఓ సైకిల్ వ్యానులో కూర్చొని వుంది. దూరం నుండి చూస్తున్న నేను వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని దగ్గరికి వెళ్లాను. అక్కడ పాఠ్యపుస్తకాలను ముందేసుకుని కూర్చొని అక్షరాలు కూడబలుకుతూ, సొంతంగా చదవడానికి ఆ పిల్లలు ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యం చూసి నాకు ఆశ్చర్యం, బాధ కలిగాయి. ఆ పిల్లల్లో కొంతమంది స్కూలుకు వెళుతున్నారు. మిగిలిన వారు అర్ధంతరంగా చదువు ఆపేశారు. 'ఇక్కడ ఎందుకు చదువుకుంటున్నారు' అని అడిగినప్పుడు 'చదువుకోవడం మాకు ఇష్టం. కానీ మా అమ్మానాన్న స్కూలుకు పంపడం లేదు' అంటూ వాళ్లు అమాయకంగా చెప్పారు. ఆ రోజే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ పిల్లలను ఎలాగైనా చదువుకు దగ్గర చేయాలని. అయితే అది నా ఒక్కడి వల్ల కాదు. అందుకే నా సిబ్బంది సాయం అడిగాను' అంటూ తనకెదురైన అనుభవం గురించి చెబుతున్నారు ప్రశంజిత్.
పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తూ.. సామాజిక సేవలో ముందుండే ప్రశంజిత్ అంటే సిబ్బందికి చాలా గౌరవం. అందుకే ఆయన ప్రతిపాదనను వారు అంగీకరించారు. వంతుల వారీగా ఆ బస్తీ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు సిద్ధమయ్యారు. 30 నుండి 40 మంది పిల్లలతో రెండు షిఫ్ట్‌ల్లో ట్యూషన్లు చెబుతున్నారు.
'మా ఏరియాకి మొదటిసారి ఈ పోలీసు అంకుల్స్ వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను. అయితే వాళ్లు మాకు చదువు చెప్పేందుకు వచ్చారని తెలిసి చాలా సంతోషమేసింది. రోజూ సాయంత్రం పోలీస్ అంకుల్స్, ఆంటీలు మాకు ట్యూషన్లు చెబుతున్నారు' అంటోంది రోజు కూలీ చేసుకునే వ్యక్తి కూతురు 4వ తరగతి చదువుతున్న విప్లవ్ మండల్.
'పిల్లలు కష్టంగా భావించే హిందీ, ఇంగ్లీషు, లెక్కలు ఈ ట్యూషన్ సెంటర్‌లో చెబుతున్నారు. ఈ ట్యూషన్లకు చాలా మంచి స్పందన వస్తోంది. పోలీస్ యూనిఫామ్‌లో పిల్లలకు పాఠాలు చెబుతున్న వారిని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవరుగా చేస్తున్నాను. నా సంపాదనతో కుటుంబం గడవడమే కష్టం. పిల్లలను స్కూలుకు పంపడమే ఎక్కువ. ఇక ట్యూషన్లు పెట్టించే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. 'పాఠాలు అర్థం కావడం లేదు నాన్న.. ట్యూషనుకు పంపించు..' అని పిల్ల ఎన్నిసార్లు అడిగినా వినపడనట్లు ఉండేవాడ్ని. కాని ఇప్పుడు మా పాప ట్యూషనుకు వెళుతోంది. ఇదంతా ఆ పోలీసుల వల్లే సాధ్యమైంద'ని చెబుతున్నాడు బస్తీ వాసి గోపాల్ షా.
'నాకు స్కూల్లో చెప్పే ఇంగ్లీషు పాఠాలు అర్థమయ్యేవి కావు. దీంతో బడి మానేశాను. కానీ ఇప్పుడు పోలీసు ఆంటీ నాకు ఇంగ్లీషు నేర్పిస్తోంది. నేను మళ్లీ స్కూలుకు వెళ్తున్నాను. ఇంకెప్పుడూ బడి మానను' అంటూ మెరుస్తున్న కళ్లతో చెబుతోంది 3వ తరగతి చదువుతున్న ప్రియాంక నాస్కర్. ఈ పోలీసు బృందం చేస్తున్న పని చాలా చిన్నదే కావచ్చు. కానీ బస్తీ పిల్లలను చదువుకు దగ్గర చేసే ఈ ఆలోచన మెచ్చుకోతగ్గది.










