Aug 31,2023 22:21

కొలంబో: శ్రీలంక యువ పేసర్‌ మథీశ పథిరన దెబ్బకు బంగ్లా బ్యాటర్స్‌ విలవిల్లాడారు. పథిరణ నిప్పులు చెరిగే బంతులకు తోడు తీక్షణ, ధనుంజయ కూడా రాణించడంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు 42.4ఓవర్లలో 164పరుగులకే ఆలౌటయ్యింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్‌ హొసేన్‌ శాంటో(89) ఒంటరి పోరాటం మినహా.. మిగతా బ్యాటర్స్‌ నిరాశపరిచారు. కెప్టెన్‌ షకిబుల్‌ హసన్‌(5)కి తోడు స్టార్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌(13) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మహ్మద్‌ నయీం, తంజిద్‌ హసన్‌ బంగ్లా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. జట్టు స్కోర్‌ నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌.. 94పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శాంటో ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ చేర్చాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ సింగిల్స్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 42.4ఓవర్లలో 164పరుగులకే పరిమితమైంది. పథిరనకు నాలుగు, తీక్షణకు రెండు, ధనుంజయ, దునిత్‌, శనకకు ఒక్కో వికెట్‌ దక్కాయి.