- వైసిపిని గద్దె దింపడమే టిడిపి-జనసేన లక్ష్యం
- ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించకుండా అధ్వానంగా మార్చేశారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా హిందూపురంలోని ఆయన నివాసంలో టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసిపిని గద్దె దింపేలా రెండు పార్టీలు భవిష్యత్తులో కలిసి పని చేసేలా ఉమ్మడి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం హిందూపురం జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పపత్రిలో సమస్యలపై మెడికల్ సూపరింటెండెంట్ రోహిల్‌కుమార్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. వైద్య పరికరాలు లేవని, ఉన్న వాటిని వినియోగించుకోవడంలేదని అన్నారు. గతంలో తాను ఇచ్చిన వెంటిలేటర్లను నిరుపయోగంగా పడేశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోవడంతో వైద్య సేవలను నిలిపివేస్తామని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. అనంతరం టిడిపి ప్రభుత్వ హయాంలో హిందూపురం ఆస్పత్రిలో రూ.22 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆస్పత్రి ముందు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.
బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసిపి కార్యకర్త
బాలకృష్ణ పర్యటనలో బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి నాయకులు అశ్వర్థరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాలకృష్ణ కారును వైసిపి కార్యకర్త మధు మేళాపురం వద్ద అడ్డుకున్నాడు. చేతిలో ఉన్న ప్లకార్డును బాలకృష్ణ కారుపైకి విసిరారు. పోలీసులు అడ్డుకోవడంతో ఫ్లకార్డుకు ఉన్న కర్ర ఎస్‌ఐకి తగిలింది. పోలీసులు మధును పట్టుకునేందుకు యత్నించగా అక్కడి నుంచి పారిపోయాడు.