సిద్ధిపేట అనే పట్టణంలో శ్రీనివాస్, కళ అనే దంపతులు ఉన్నారు. వారి పిల్లలు కిరణ్, ఉష. వేసవి సెలవుల్లో ఆ కుటుంబం అంతా బీచ్‌కు వెళ్లారు. పిల్లలిద్దరూ బీచ్‌లో సరదాగా ఆటలాడుకున్నారు. తినుబండారాలు కొని తిన్నారు. ఫొటోలు దిగి చాలా సంతోషించారు. ఇంతలో బీచ్‌లో నడుస్తున్న ఉష కాళ్ళకు ప్లాస్టిక్ బాటిళ్లు తగిలాయి. అక్కడ పడేసిన ఖాళీ బాటిళ్లు, కవర్లు వంటి ప్లాస్టిక్ వస్తువులను చూసి 'డాడీ, ప్లాస్టిక్ వస్తువులను ఇలా పడేస్తే, సముద్రం కలుషితమవుతుంది. చేపలు చనిపోతాయి కదా'' అని అడిగింది. అప్పుడు వాళ్ల నాన్న ''నిజమేనమ్మా, మనుషుల్లో బాధ్యతా రాహిత్యం ఎక్కువైంది'' అన్నాడు.
ఉష అక్కడున్న చాలా మందిని గమనించింది. కొందరు ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకున్న తినుబండారాలు తినేసి, కవర్లు అక్కడే పడేస్తున్నారు. మరికొందరు తాగిన వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్ బాటిళ్లు పడేస్తున్నారు. అక్కడి వాతావరణం చూసి ఉషకు చాలా బాధేసింది. వెంటనే ఉష, కిరణ్ బీచ్‌లో నడుస్తూ.. 'ప్లాస్టిక్ వస్తువులను చెత్త కుండీలోనే వేయండి. సముద్రాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడండి' అని బిగ్గరగా అరిచారు.
ఇలా ఇద్దరు పిల్లలు నినాదాలు చేసుకుంటూ బీచ్ అంతటా తిరిగారు. చాలామంది వీరిని వింతగా చూశారు. కొంత మంది వీరి తపన చూసి మెచ్చుకున్నారు. ఎవరైతే ప్లాస్టిక్ వస్తువులతో కలుషితం చేసారో, వారు సిగ్గుపడ్డారు. కింద పడేసిన వస్తువులను తీసి చెత్త కుండిలో వేశారు. వారిలో వచ్చిన మార్పు చూసి పిల్లలిద్దరూ చాలా సంతోషపడ్డారు. ఇక నుండి వారం వారం బీచ్‌కు వచ్చి ఇలా ప్రచారం చేస్తామని నాన్నతో చెప్పారు. ప్రకృతి పట్ల పిల్లలు చూపిస్తున్న ప్రేమకు సంతోషపడిన శ్రీనివాస్ అలాగేనని చెప్పాడు.

- కొంపల్లి విశిష్ట, 9వ తరగతి, జక్కాపూర్, సిద్ధిపేట జిల్లా.










