
లాహోర్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడంతో నిరాశకు గురైన బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్టు, తన రాజీనామా లేఖను పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(పిసిబి) ట్విటర్ పంపినట్లు తెలిపాడు. ''నేను అన్ని ఫార్మాట్ల నుంచీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ, ఈ నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఆటగాడిగా మూడు ఫార్మాట్లలోనూ పాక్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కు, జట్టుకు మద్దతు ఇస్తాను. నా మీద నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు పాక్ క్రికెట్ బోర్డుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు'' అని బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు.