Nov 05,2022 06:26

ఈ మధ్యకాలంలో మళ్లీ జన్యు మార్పిడి (జి.యం) విత్తనాలకు నూతన రూపంలో తెరలేచింది. గత ఏడెనిమిదేళ్ల్లుగా వ్యాపారుల ఖజానాల్లో దాచిన జి.యం ఆవాల హైబ్రిడ్‌ విత్తనాలు విడుదల చేయబడే దశలోకి వచ్చాయి. జన్యు మార్పిడి విత్తనాల్ని నియంత్రించాలనీ, విత్తన కంపెనీల ఏకపక్ష వైఖరిని భరించేది లేదని గత ప్రభుత్వం మీద ఉద్యమించిన ఈనాటి దేశభక్తి ఛాంపియన్‌ పాలకులు, చాలా విషయాల్లో లాగానే కంపెనీ పెట్టుబడిదారులకు లొంగుబాటు ప్రదర్శించే దశకి ఇదొక నిదర్శనంగా మారింది. ''మేక్‌ ఇన్‌ ఇండియా'' నినాదాల డొల్లతనాన్ని విప్పి చూపబోతుందీ ఆవాల హైబ్రిడ్‌ ప్రహసనం. జి.యం పంట విత్తనాల ఆమోదయోగ్యత కోసం ఆబగా ఎదురు చూస్తున్న కంపెనీల పంట పండబోతున్నదని అర్ధమౌతూనే ఉంది.

  • విత్తన గుత్తాధిపత్యం

ప్రపంచ వాణిజ్య సంస్థ ముసుగుతో గుత్త సొమ్ము (మేధోపర హక్కుల చట్టం) రక్షణ వలయంలోకి నెట్టబడ్డ వ్యవసాయ సాంకేతికాలు, వివిధ బహుళజాతి కంపెనీలకు వ్యాపార సరకుగా మారాయి. రాను రాను 70 శాతం వ్యవసాయ ఉపకరణాల ఉత్పత్తి, అమ్మకం కేవలం మూడు (బేయర్‌ ం మాన్సెంటో, డౌ ం డూపాంట్‌, సింజెంటా ం కెమివైనా) అతి పెద్ద పెట్టుబడిదారుల అదుపులోకి వెళ్ళాయి. ఈ కంపెనీలు ప్రపంచ వ్యవసాయాన్ని అనగా అతి కీలకమైన ఆహార రంగాన్ని శాసించే దశలోకి ఎదిగాయి. వీటి వార్షిక బడ్జెట్‌ చాలా దేశాల స్థూల జాతీయోత్పత్తుల కంటే ఎక్కువ. అమెరికా వంటి ధనిక దేశాల పాలనా రంగాన్ని ప్రభావితం చేసి, వివిధ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఐరోపా దేశాల సార్వభౌమత్వాన్ని ప్రజాస్వామ్య లక్షణాల్ని దిగజార్చుతూ వస్తున్నాయీ కంపెనీలు. అదిగో ఆ నేపథ్యంలో ప్రవేశ పెట్టబడ్డవే నూతన సాంకేతికాభివద్ధి పేరుతో వచ్చిన జి.యం విత్తనాలు. జన్యుమార్పిడి జీవులు. మొదట్లో పంట విత్తనాల్లోకి నూతన జన్యువుల ప్రవేశ పెడితే దిగుబళ్లు అనూహ్యంగా పెరగటమే గాక, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్రయోజనం వుంటుందని ప్రచారం చేశారు. వేల మంది శాస్త్రవేత్తల్ని, భాషా నిపుణుల్ని వినియోగించి (వాషింగ్‌టన్‌ కేంద్రంగా) సామాన్యుల్ని నమ్మించగలిగారు. ఫలితంగా అమెరికా మొదలుకొని ఆస్ట్రేలియా వరకు ''మాన్సెంటో కంపెనీ'' రూపొందించిన జి.యం విత్తనాల మూలంగా మారిన స్థితి నెలకొన్నది. మొక్కజొన్న, సోయా చిక్కుడు, పత్తి, టమోటో వంటి పంటల విత్తనాలన్నీ కంపెనీల అదుపులోకెళ్లాయి. ఇదే వ్యవసాయ సమస్యలకు పరిష్కారమని నమ్మించి వివిధ దేశాలకు జి.యం. టెక్నాలజీల్ని పాకించారు. ఆ క్రమంలోనే 2001 నాటికి ఆర్థిక సంస్కరణల పాట నందుకొన్న భారతదేశ వ్యవసాయం లోకి మొదటి జన్యుమార్పిడి పంట - బి.టి పత్తి - ప్రవేశించింది. ఐదారేళ్లలో మొత్తం పత్తి విత్తనాలన్నీ ఏక జన్యువాధారిత బి.టి. హైబ్రిడ్‌లుగా మారాయి. మొదటితరం టెక్నాలజీల నుండి రెండు, మూడు తరాల జన్యుమార్పిడి టెక్నాలజీలతో పత్తి విత్తనాల్ని సొంతం చేసుకోగలిగాయి కంపెనీలు. బి.టి పత్తి విత్తనాల వల్ల దిగుబళ్లు అప్రతిహతంగా పెరిగాయని అంకెల గారడీలతో ప్రచారం చేశారు. పెరిగిన సాగు భూమి, రసాయనాల వాడకం, సాగునీరు వినియోగం వంటి వాటిని, పోగొట్టుకున్న ప్రయోజనకర జీవుల విలువను గుర్తించలేని వారిది నమ్మారు. నిజానికి బి.టి హైబ్రిడ్‌ విత్తనాలు వాడని చాలా దేశాల్లో పత్తి దిగుబళ్లు, ఉత్పాదకతలు భారతదేశం కంటే ఎక్కువనే సత్యాన్ని దాచిపెట్టారు. అలానే బి.టి టెక్నాలజీ కేవలం హైబ్రిడ్‌ల ద్వారానే విస్తరింపజేయటాన్ని సమర్థించి మోసం చేశారు. బి.టి పత్తి విత్తనాల్ని ప్రవేశింపజేసే దశలో దేశ క్యాబినెట్‌ సెక్రటరీగా పని చేసిన టి.ఎన్‌.ఆర్‌. సుబ్రహ్మణ్యన్‌ ఈ విషయాన్ని బయట పెట్టారు (ది హిందూ, 25-5-2017).
ఆ కంపెనీలు తమ కృత్రిమ రసాయనాల అమ్మకం పెంపు కోసం, విత్తనాలపై పెత్తనం కోసం నూతన టెక్నాలజీల ముసుగుతో బి.టి కాటన్‌తో ప్రవేశించాయని తాము గుర్తించలేకపోయామని సుబ్రహ్మణ్యన్‌ వాపోయారు. కుట్రను ఆలస్యంగా గుర్తించిన నాటి పాలకపక్ష ప్రతినిధులు కొందరు మాన్సెంటో మహికో రూపొందించిన బి.టి వంగకు, బేయర్‌ కంపెనీ తయారు చేసిన బి.టి ఆవాలకు అనుమతి ఇవ్వలేకపోయాయని గుర్తు చేశారాయన. దేశంలోని ప్రముఖ శాస్త్ర పరిశోధనా సంస్థల నిపుణులు కొందరు, సామాజిక, పర్యావరణ అధ్యయన ఉద్యమకారులు బి.టి టెక్నాలజీల పేరుతో కంపెనీల గుత్త సొమ్ముగా మారుతున్న విత్తనాల ప్రమాదాన్ని బహిరంగ చర్చకు పెట్టారు. ఈ కంపెనీల అనైతికతను ఎండగడుతూ, ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన ''కార్టజినా ఒప్పందానికి'' వీరెంత ప్రమాదకారులో విప్పి చెప్పారు. జన్యు మార్పిడి టెక్నాలజీల్ని వంగ, ఆవాలు వంటి స్థానికతకు (మూలాలకు) నిదర్శనమైన విత్తనాల్లో ఎందుకు వాడకూడదో విశ్లేషించారు. అంతేగాదు, దేశ అత్యున్నత న్యాయస్థానం, నిపుణుల సహాయంతో చర్చించి...ఈ తరహా టెక్నాలజీల మంచి చెడ్డలు, దీర్ఘకాలిక ప్రభావాలు తెలిసే వరకు వాడకూడదని తీర్పిచ్చారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం జి.యం టెక్నాలజీల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయగల స్థానిక సంస్థలు రూపొందే వరకు కేవలం కంపెనీలిచ్చే సమాచారం ఆధారంగా విడుదల చేయొద్దని సూచించబడ్డది. అయినా మాన్సెంటో వంటి కంపెనీలు స్థానిక కంపెనీల అండతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం చెల్లిన తన టెక్నాలజీలకు రాయల్టీ వసూలు చేస్తూనే ఉన్నాయి. ప్రేక్షక పాత్ర వహిస్తున్న వ్యవసాయ మంత్రుల్ని మాయచేయగలిగాయి. తన నూతన తరానికి చెందిన జన్యు మార్పిడి పంట విత్తనాలకు అనుమతి ఇవ్వాల్సిందేనని ప్రభ్వుత్వాన్ని ఒత్తిడి చేశాయి. పైగా దేశీయ పరిశోధనా సంస్థల ద్వారా రూపొందించబడ్డ ''బికనెరి నెర్మా'' బి.టి పత్తి సూటి రకాల్ని రైతుల స్థాయికి వెళ్లకుండా ఆపింది మాన్సెంటో. అప్పటి పాలకులు, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడికి, రైతు సంఘాల ఉద్యమాలకు తాత్కాలికంగా తలొగ్గి, నూతన జి.యం విత్తనాల ప్రవేశంపై మారిటోరియం విధించారు. అయినా కంపెనీల ఒత్తిడి ఆగలేదు. దానికి నిదర్శనమే నేటి ఢిల్లీ యూనివర్శిటీ వారి ముసుగుతో ప్రవేశింపజేసే జి.యం. ఆవాల హైబ్రిడ్‌.

  • స్వదేశీ ముసుగుతో కాలం చెల్లిన టెక్నాలజీ

మరో హరిత విప్లవం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయటం తమ లక్ష్యమని, అదీ సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ పంటల సాగు విధానాల ద్వారానే సాధ్యమంటున్న ప్రస్తుత పాలకులు, తమ పాలనలో అనేక పిల్లిమొగ్గలు వేస్తూ వస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారుల కోసం, దేశీయ (నీతి లేని) వ్యాపారుల కోసం తలుపులు తెరచే ఉన్నాయని చెప్పకనే చెప్తూ తమ ద్వంద్వ వైఖరిని నిస్సిగ్గుగా బయటపెడుతూ వస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు స్వదేశీ జి.యం ఆవాలకు పచ్చజెండా ఊపటం అనుకోవచ్చా! దేశభక్తిని అతిగా వొలకబోసే స్వదేశీ జాగరణ్‌ మంచ్‌లు కూడా నిస్సహాయులుగా మిగిలిపోయాయి.
కంపెనీల ఆర్థిక దన్నుతో, తస్కరించిన జన్యువుల నేపథ్యంతో, అసంపూర్ణమైన అసంబద్ధమైన క్షేత్రస్థాయి అధ్యయనాలతో డా.దీపక్‌ పెంతల్‌ అనే ఢిల్లీ యూనివర్శిటీ శాస్త్రవేత్త (మాజీ వైస్‌ ఛాన్సలర్‌ కూడా) ఎన్నో కోర్టు అభ్యంతరాలను, సాటి శాస్త్రవేత్తల విమర్శలను లెక్క చేయకుండా రూపొందించిందే ఈ బి.టి లేక జి.యం ఆవాలు. ఇది వాస్తవానికి బేయర్‌ కంపెనీ రూపొందించిన దానికి నకలు. దీనికిప్పుడు ''స్వదేశీ'' అనే ముసుగు తొడిగారు. ఎక్కువ కలుపు మందులు వాడి సాగు ఖర్చును తగ్గించేందుకు ఇవి వెసులుబాటు కల్పిస్తాయట. పైగా జి.యం హైబ్రిడ్‌ల వల్ల దేశంలో వంట నూనెల కొరత తీరిపోతుందట. ఇదెంత వాస్తవమో జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అలానే కేవలం జి.యం హైబ్రిడ్‌లను నిషేధించి సాధారణ ఆవాల రకాలను మాత్రమే పండించగలుగుతున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చెకోస్లావేకియా, జర్మనీ వంటి దేశాల ఆవ పంట ''ఉత్పాదకత'' భారతదేశం కంటే ఎంత ఎక్కువో గణాంకాలు నిరూపిస్తున్నాయి. బీహార్‌లో గత ఐదారేళ్లలో 'సిస్టమ్‌ ఆఫ్‌ మస్టర్డ్‌ ఇంటెన్సిఫికేషన్‌'' అనే పథకం ద్వారా, దేశీయ వంగడాలు మాత్రమే వాడి ఏ విధంగా అధిక దిగుబళ్లు తియ్యొచ్చో చూపించారు.
పైగా జి.యం (బి.టి) ఆవాల ద్వారా వచ్చే నూనె, చెక్క వంటివి ఆరోగ్యానికి, పర్యావరణానికి దీర్ఘకాలంలో నష్టకరమని అమెరికా, అర్జెంటీనా వంటి దేశాల్లో బయటపడ్డది. ముఖ్యంగా జి.యం ఆవాల పైరులో వాడబడుతున్న గ్లైపాసేట్‌ వంటి కలుపు మందు ఎంత ప్రమాదకరమో తేలిన తరువాత కూడా ఈ వరవడిని ప్రేరేపించడం ఎంత దేశద్రోహం? గ్లైపాసేట్‌ (బెయర్‌-మాన్సెంటో, గుత్త సొమ్ము) వల్ల క్యాన్సర్‌, ఆటిజమ్‌, మతిమరుపు (అల్జీమర్‌) వ్యాధి, గర్భకోశ వ్యాధులు, శిశువుల్లో అవయవ లోపాలు వస్తున్నాయని చాలా దేశాల్లో గుర్తించబడ్డది. ప్రపంచ ఆరోగ్య సంస్థ క్రోడీకరణలు దాని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. చాలా దేశాల్లో దాని వాడకాన్ని నిషేధించారు.

అయినా మన స్వదేశీ దేశభక్త పాలకులకు ఇవేమీ పట్టడంలేదు. కేవలం పెట్టుబడులు, పరిశ్రమలు కావాలి. నైతికతను దిగజార్చే వ్యాపారులు, ఎలక్షన్లకు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కావాలి. దాని ఫలితమే గతంలో వలే, పూర్వాపరాల్ని విశ్లేషించక ముందే, నూతన జి.యం పంటలకు అనుమతివ్వటం అనుకోవచ్చా!

కాని ఆలోచనాపరులు, రైతు సంఘ ఉద్యమకారులు, ప్రజారోగ్య-పర్యావరణ అధ్యయనకారులు, ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూనే ఉన్నారు. మాన్సెంటో -బేయర్‌ వంటి కంపెనీలు అత్యంత వేగంగా (వాటి చెడు పార్శ్వం పూర్తిగా బయటకొచ్చే లోపు) తమ జి.యం టెక్నాలజీల్ని సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో పన్నుతున్న ఈ స్వదేశీ జి.యం ఆవాల కుట్రను బహిర్గతం చేస్తూనే ఉన్నారు. విత్తన స్వావలంబనను హరించే ఈ టెక్నాలజీల్ని తిరస్కరిద్దాం! కంపెనీల దుష్ట వ్యాపార వైఖరిపై పోరాడదాం!!

GM-avalu-impacts-agriculture-article-venugopal

 

 

 


ప్రొ|| ఎన్‌.వేణుగోపాల్‌
(వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు)