Sep 24,2022 10:30
  • కేంద్రం నిర్ణయంతో ఆ పార్టీకి రూ.73 కోట్లు మిగులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇటీవల పార్టీ కార్యాలయాలకు కేటాయించిన స్థలాల ఫీజు తగ్గిస్తూ కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం వల్ల బిజెపి భారీగా లబ్ధి పొందుతోంది. రాజకీయ పార్టీలకు ఢిల్లీలో కేటాయించిన భూమికి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వసూలు చేసిన భూమి ఫీజులో దాదాపు 75 శాతం తగ్గిస్తూ కేంద్ర మంత్రి వర్గం ఇటీవల నిర్ణయించింది. దీంతో, బిజెపి కార్యాలయం కోసం కేటాయించిన స్థలానికి చెల్లించాల్సిన రూ.73 కోట్లు ఇక చెల్లించాల్సిన అవసరం లేదు. బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌, జెడియు, డిఎంకె, టిడిపితో సహా పలు పార్టీలు ప్రభుత్వం గతంలో ప్రకటించిన దానికంటే తక్కువ చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే చెల్లింపు చేసిన ఎఐఎడిఎంకె, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, సమాజ్‌ వాదీ వంటి పార్టీలు కొంత మొత్తం తిరిగి పొందుతాయి. ఆయా పార్టీలకు స్థలాలు 2000 నుంచి 2017 మధ్య ఈ స్థలాలు కేటాయించారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లో బిజెపికి కేటాయించిన నాలుగు ఎకరాల కంటే కొంచెం ఎక్కువ ఉన్న మూడు ల్యాండ్‌ పార్శిళ్ల భూమి కోసం ఆ పార్టీ రూ.91 కోట్లు చెల్లించాల్సి ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం రూ.17.78 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.73.22 కోట్లు ఆదా అవుతుంది.