
- కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం చేస్తే సహించం : గఫూర్
- అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో కొనసాగిన ప్రజారక్షణ భేరి
ప్రజాశక్తి- కడప ప్రతినిధి, తాడిపత్రి, గుత్తి : బిజెపి అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల పాలన సాగిస్తోన్న ఆ పార్టీతో దేశానికి అత్యంత ప్రమాదమని అన్నారు. కోటిమంది స్కీమ్ వర్కర్లను విధుల నుంచి తొలగించే కుట్రకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగి 13 మంది మరణించినా మోడీకి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. బిజెపి అధికారంలో కొనసాగితే దేశం అధోగతిపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర బుధవారం వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాల్లో కొనసాగింది. బద్వేలు నుంచి కడప, తాడిపత్రి మీదుగా గుత్తి చేరుకుంది. ఈ యాత్రకు సిపిఎం శ్రేణులు, ప్రజల నుంచి ఎక్కడికక్కడే ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో గఫూర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, వెనుక బడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, రైల్వే జోన్, పోలవరం వంటి విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటైతే వేలాది మందికి ఉద్యోగాలొస్తాయని, ఫలితంగా వైఎస్‌ఆర్ జిల్లా నుంచి వలసలు తగ్గుతాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఓ బండరాయిని వేశారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో బండరాయిని వేశారని విమర్శించారు. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తే సహించబోమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణయ్య, శివనాగరాణి, ఉమామహేశ్వర రావు, భాస్కరయ్య మాట్లాడుతూ బిజెపి విధానాల వల్ల కోట్లాది మంది కార్మికుల, కర్షకుల సంపద కొద్దిమంది దగ్గరే పోగుపడుతోందన్నారు. దేశంలో పేదరికం పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి సర్కారు కొత్తగా ఒక్క ప్రాజెక్టునుగానీ, పరిశ్రమనుగానీ ఎందుకు తీసుకురాకపోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 440 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొనగా, కేవలం 103 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం శోచనీయమన్నారు. గత తొమ్మిన్నరేళ్లలో మహిళలకు, పసిపిల్లలకు రక్షణ కల్పించడంలో విఫలమైన బిజెపి ప్రభుత్వం... మహిళా రిజర్వేషన్ బిల్లును ఓట్ల కోసమే ఇప్పుడు తెచ్చిందని విమర్శించారు.