
పశ్చిమ బెంగాల్‌లో, తెలంగాణలో కుటుంబ పాలనను బిజెపి అంతమొందిస్తుందని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, కేరళల్లో అధికారంలోకి వస్తుందని అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఎంవిఎ ప్రభుత్వాన్ని కూల్చివేసి, బిజెపి అదుపులో వుండే ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడంలో సాధించిన విజయం నుండి వచ్చిన ధీమాతోనే 'ఆపరేషన్ కేప్చర్' పట్ల ఆయన అంత ధైర్యంగా మాట్లాడారు.
ఏక పార్టీ నిరంకుశ పాలనను నెలకొల్పే దిశగా ముందుకు సాగాలన్నది బిజెపి ఆలోచనగా వుందని జులై 2-3 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మాటల్లో స్పష్టంగా వ్యక్తమైంది. రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ అమిత్ షా, రాబోయే 30-40 సంవత్సరాలు ఇకపై భారత్‌లో బిజెపి శకమేనని వ్యాఖ్యానించారు. అయితే, నాజీ జర్మనీ తరహాలో మరో వెయ్యేళ్ళు బిజెపి పాలన గురించి ఆయన మాట్లాడలేదంటే కొంచెం కారుణ్యంతో వ్యవహరించినట్లే.
అయితే, భారత దేశాన్ని ఏక పార్టీ హిందూత్వ నియంతృత్వం లోకి మార్చడానికి బిజెపి శకానికి మూడు లేదా నాలుగు దశాబ్దాలు పడుతుంది.
పశ్చిమ బెంగాల్‌లో, తెలంగాణలో కుటుంబ పాలనను బిజెపి అంతమొందిస్తుందని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, కేరళల్లో అధికారంలోకి వస్తుందని అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఎంవిఎ ప్రభుత్వాన్ని కూల్చివేసి, బిజెపి అదుపులో వుండే ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడంలో సాధించిన విజయం నుండి వచ్చిన ధీమాతోనే 'ఆపరేషన్ కేప్చర్' పట్ల ఆయన అంత ధైర్యంగా మాట్లాడారు.
మహారాష్ట్రలో బిజెపి ఏతర ప్రభుత్వ అస్థిరీకరణ సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఇక్కడ ఎంఎల్‌ఎలకు ముడుపులు అందచేయడం, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడం, సభ్యుల బేరసారాలు వంటి వాటికే బిజెపి పరిమితం కాలేదు. ఇటువంటి సాంప్రదాయ పద్ధతులతోపాటు శివసేనను, ఆ ప్రభుత్వాన్ని చీల్చడంలో మోడీ ప్రభుత్వం తన అధికార బలాన్ని, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను పూర్తి స్థాయిలో వినియోగించింది.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చివేసే ఆపరేషన్ జరుగుతుండగానే, శివసేన ఎంఎల్‌ఎల అనర్హతను ప్రకటించకుండా నివారించడం ద్వారా సుప్రీంకోర్టు వారి ఫిరాయింపులకు అవకాశం కల్పించింది. ఆ 16 మంది ఎంఎల్‌ఎ లను ఎందుకు అనర్హులుగా ప్రకటించరాదో కోరుతూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై కోర్టు స్టే విధించింది. ఎంఎల్‌ఎ లకు పంపిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి రెండు వారాల కన్నా ఎక్కువే సమయాన్ని సుప్రీం కోర్టు పొడిగించింది. తద్వారా ఆ మొత్తం చర్యను నిష్ప్రయోజనంగా మార్చింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధం. అనర్హతపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ కేవలం శాసనసభ పరిధి లోనే వుంటుంది. నిర్ణాయక క్రమం పూర్తయిన తర్వాత మాత్రమే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.
అత్యున్నత న్యాయస్థానం ఈ తీరున వుంటే, ఇక గవర్నర్ పాత్ర మరీ దారుణంగా వుంది. గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి దాదాపు 17 మాసాలుగా ఎంవిఎ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికను నిర్వహించేందుకు అనుమతించలేదు. కొన్ని నిబంధనలకు సంబంధించి ఏదో వ్యాజ్యం నడుస్తోందని సాకు చెబుతూ వచ్చారు. అయినప్పటికీ, కొత్త బిజెపి-రెబెల్ సేన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. రెండు రోజుల్లో స్పీకర్ ఎన్నికకు తేదీని నిర్ధారించడంలో గవర్నర్‌కి ఎలాంటి సమస్య రాలేదు. ఎంవిఎ ప్రభుత్వ హయాంలో, గవర్నర్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మాదిరిగానే వ్యవహరించారు.
ఇకపోతే, ఎంవిఎ ప్రభుత్వంపై ప్రయోగించబడిన కీలకమైన ఆయుధం కేంద్ర దర్యాప్తు సంస్థలు, ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి). పలువురు శివసేన, ఎన్‌సిపి నేతలపై దర్యాప్తుకు ఇ.డి ని ఉసిగొల్పారు. దుర్మార్గమైన మనీ లాండరింగ్ అభియోగాలపై ఇద్దరు ఎన్‌సిపి మంత్రులను జైల్లో కూడా పెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపుల నుండి తప్పించుకోవడమే బిజెపి వైపునకు ఫిరాయించడం వెనుక ముఖ్య కారణం.
రాజ్యానికి చెందిన వివిధ సంస్థల (గవర్నర్, కేంద్ర దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ) దన్ను చూసుకుని...ఏ రాష్ట్రమూ బిజెపి విజయోత్సాహాన్ని నిరోధించలేదని అమిత్ షా అంత డాంబికంగా ప్రకటించగలిగారు. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలను గెలవాలంటే రాజకీయ కార్యకలాపాల ద్వారానే సాధ్యపడదు కాబట్టి రాజ్యం తాలూకు బలాన్నంతటిని పూర్తి స్థాయిలో ఉపయోగించినప్పుడే సాధ్యం. అప్పుడు మాత్రమే ''ఒక దేశం, ఒక పార్టీ'' సాధ్యమవుతుంది.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు రోజుల్లో జరిగిన అరిష్టదాయకమైన పరిణామాలు, బిజెపి శకంలో ఏం జరుగుతుందో సూచనప్రాయంగా తెలియచేస్తున్నాయి. 2002 గుజరాత్ నరమేథం లోని బాధితులకు న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న కృతనిశ్చయానికి శిక్షగా తీస్తా సెత్వలాద్, ఆర్.బి. శ్రీకుమార్ లను జైల్లో పెట్టడంలో ప్రభుత్వ నిరంకుశత్వం మరోసారి బయటపడింది. స్వేచ్ఛా, స్వతంత్రాలతో కూడిన జర్నలిజాన్ని అనుసరిస్తున్నందుకు, వాస్తవాలు వెల్లడిస్తున్నందుకు తప్పుడు కేసులు బనాయించి మహ్మద్ జుబేర్‌ను అరెస్టు చేశారు. స్వతంత్ర మీడియాపై ప్రభుత్వం తన అణచివేత చర్యలను కొనసాగిస్తున్నదనడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. బిజెపి శకంలో ఇక విధేయతతో కూడిన మీడియానే వుంటుంది. అసమ్మతి అభిప్రాయాలకు అక్కడ తావు లేదు.
ఒకపక్క హిందూత్వ సంస్థలు ముస్లిం వ్యతిరేక మనోభావాలను రెచ్చగొడుతూ సమాజంలో శాశ్వత విభజన సృష్టిస్తుంటే, మరోపక్క ముస్లిం తీవ్రవాదులకు బిజెపి ఆశ్రయం ఇస్తున్నదనే అనూహ్యమైన విషయం వెలుగు చూసింది. ఉదరుపూర్‌లో ఇటీవల హత్యకు గురైన దర్జీ కన్హయలాల్ హత్య కేసులోని ఇద్దరు నిందితుల్లో ఒకరు మహ్మద్ రియాజ్ అక్తారి బిజెపి మైనారిటీ విభాగ సభ్యుడని వెల్లడైంది. అంతకంటే తీవ్రమైన అంశమేమంటే, జమ్మూలో అరెస్టయిన లష్కరే తోయిబా కమాండర్ తలిబ్ హుస్సేన్ షా జమ్మూలో బిజెపి సోషల్ మీడియా అధిపతిగా వున్నాడని కనుగొన్నారు. అన్ని రకాల తీవ్రవాదులకు బిజెపి ఇలా ఆశ్రయం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయినా కూడా, ఇరు పక్షాల నుండి తీవ్రవాద కార్యకలాపాలు చెలరేగినపుడు మాత్రమే మతోన్మాద పోకడలు ఉధృతమవుతాయనేది స్పష్టమవుతోంది. హిందూ ప్రయోజనాలకు తనను తాను ఛాంపియన్‌గా ప్రకటించుకునే పార్టీలో కార్యకర్తల స్థాయిలో ముస్లిం తీవ్రవాదుల ఉనికి వుండడం వ్యతిరేకుల ఐక్యతగా కనిపిస్తోంది.
సరికొత్త బిజెపి శకం ఆరంభమవుతుందంటూ అమిత్ షా ప్రదర్శిస్తున్న మతోన్మాద, నిరంకుశవాద ఆలోచనా విధానం ఏదో వాక్చాతుర్యానికి సంబంధించిన అంశంగా కొట్టిపారేయడానికి వీల్లేదని బహిరంగ సభలో తమ నాయకుడు చెప్పిన ఉద్ఘాటనలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం భాగ్యనగరంగా మారాలని మోడీ కోరుకుంటున్నారు. అంటే, కేవలం నగరం పేరును మార్చడం గురించి చెప్పడం కాదు, సరికొత్త హిందూత్వ శకానికి ఇదొక గుర్తు.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)