May 20,2023 09:54
  • మతరాజ్యంతో సమాజ విచ్ఛిన్నం
  • లోక్‌సభ పూర్వ సెక్రటరీ జనరల్‌ పిడిటి చారి
  • హైదరాబాద్‌లో సుందరయ్య 38వ స్మారకోపన్యాసం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : 'కేశవానంద భారతి కేసులో తీర్పు ప్రకారం ప్రాథమిక హక్కులతోసహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నయినా సవరించే అధికారం పార్లమెంటుకుంటుంది. అయితే, రాజ్యాంగపు మౌలిక సూత్రాలను సవరించే అధికారం ఉండదు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది కాబట్టి ఈ దేశాన్ని ధార్మిక రాజ్యంగా మార్చేద్దామని పాలకపక్షం అనుకుంటే కేశవానంద భారతి తీర్పును తిరస్కరించే మరో తీర్పు రావొచ్చు. అప్పుడు రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు పూర్తి అధికారాలు వస్తాయి. సంఖ్యా బలం ఉన్న పాలకపక్షం కోరుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో అధ్యక్ష తరహా పాలన అంటూ రాజ్యాంగాన్ని సవరించొచ్చు' అని లోక్‌సభ పూర్వ సెక్రటరీ జనరల్‌ పిడిటి చారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పిడిటి చారి, బివి రాఘవులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం 'భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం - సవాళ్లు రాజ్యాంగ విలువలు' అనే అంశంపై స్మారకో పన్యాసంలో చారి మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు ఐకాన్‌ సుందరయ్య అని అన్నారు. కేరళలో తాను చదువుకునే రోజుల్లో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ఎకె గోపాలన్‌, పి.సుందరయ్య పేర్లు బలంగా వినిపించేవని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో సుందరయ్య కీలకపాత్ర పోషించారన్నారు. బిజెపికి మెజార్టీ ఉన్నందున పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో అధ్యక్ష తరహా పాలన వచ్చే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు. ఈ దిశగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముందన్నారు. దేశంలో ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి భావనలను రాజ్యాంగం అందించిందని వివరించారు. భారతదేశాన్ని ఆధునిక ప్రపంచంలోకి నడిపించిన ఆయుధం రాజ్యాంగమన్నారు. దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మెరుగైన పరిపాలన చట్రమని తెలిపారు. పార్లమెంటు తొలినాళ్లలో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా మాట్లాడేవారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారని, విస్తృతంగా చర్చించి చట్టాలను రూపొందించే వారని వివరించారు. ప్రస్తుతం చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయని, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వడం లేదని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు వంటి వాటిపైనా ఐదు లేదా పది నిమిషాలు చర్చించి ఆమోదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ప్రతిష్టంభన దీర్ఘకాలం కొనసాగితే ఈ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోయి మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ వైపు ఆలోచించే ప్రమాదముందన్నారు. అధ్యక్ష తరహా పాలనవైపు మొగ్గు చూపే అవకాశముందని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీల నాయకులతో ప్రధాని నేరుగా సంప్రదించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ప్రతిపక్ష సభ్యులను శత్రువులుగా భావిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం కార్యనిర్వాహక వర్గం చేతుల్లో బందీ అయిందని పేర్కొన్నారు. పార్లమెంటును, ఇతర స్వతంత్ర వ్యవస్థలను అది నియంత్రిస్తోందన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియాను ప్రభుత్వానికి బాకాగా మారేలా అనేక ఒత్తిళ్లకు గురిచేస్తోందని విమర్శించారు. లౌకికత్వంతోనే దేశానికి మనుగడ సాధ్యమన్నారు. మత రాజ్యంతో రాజ్యాంగ విలువలైన లౌకికత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటివి కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు. తప్పుడు చరిత్రను సృష్టించడానికి, వాస్తవాలను తలకిందులు చేయడానికి నేటి పాలకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం విలువ అర్థమైతేనే రాజ్యాంగ విలువలను రక్షించుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతారని పేర్కొన్నారు. అనేక పరిణామాలు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరిస్తోన్నా, స్పందించలేని పరిస్థితికి చేరుకుంటామన్నారు. నాగరికత ప్రస్థానంలో ఏ ఒక్క తరం నిస్తేజంగా మారినా ఫాసిస్టు రాజ్యం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి వచ్చే పెనుప్రమాదాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.
 

                                                        బిజెపిని ఓడిస్తేనే దేశం ముందుకు : రాఘవులు

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓడిస్తేనే దేశం ముందుకెళ్లడం సాధ్యమవుతుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు చైర్మన్‌ బివి రాఘవులు అన్నారు. బిజెపి పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం మీద దాడి జరుగుతోందని, మనుధర్మం, ఫాసిస్టు పాలన తేవాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం ప్రమాదంలో పడ్డాయన్నారు. ఎన్నికల కమిషన్‌, పార్లమెంటు, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని విమర్శించారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లీంచేందుకు మతం, మత విశ్వాసాలను ముందు కు తెస్తోందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సమైక్యతను కాపాడుకోవాలని కోరారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు వాజ్‌పేయి హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించేందు కు కేంద్రం సిద్ధమవుతోందన్నారు. స్థానిక, రాష్ట్ర అంశాలు చర్చకు రాకుండా జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తే ఫెడరలిజం నాశనమవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో లోపాలున్నా దీన్ని రక్షించుకోవడం అందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌, ట్రస్టు సభ్యులు సి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిడిటి చారి ప్రసంగాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తెలుగులోకి అనువాదం చేశారు.