Dec 09,2022 07:51
  • ఉప ఎన్నికల్లో కమలదళానికి భంగపాటు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికారంలో ఉండి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రెండు రోజుల క్రితం ఓటమి పాలైన బిజెపి హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అదే బాట పట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా ప్రజానీకం బిజెపిని తిరస్కరించారు. గురువారం నాడు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌లో బిజెపి అధికారాన్ని కోల్పొయింది. ముందునుండి ఊహించినట్టుగానే గుజరాత్‌లో బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు కూడా పెరిగాయి. స్వరాష్ట్రం కావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం నాడే వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కమలదళానికి తీవ్ర భంగపాటు ఎదురైంది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా, వాటిలో ఒక లోక్‌సభతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను ప్రతిపక్షాలు కైవసం చేసుకున్నాయి. కేవలం రెండు శాసనసభ స్థానాల్లోనే బిజెపి గెలుపొందింది. అయితే, బిజెపితో పాటు కార్పొరేట్‌ మీడియా కూడా గుజరాత్‌ గెలుపునే భారీగా ప్రచారం చేస్తూ మిగిలిన ఫలితాలను ప్రజల దృష్టికి రాకుండా చేసే విన్యాసాన్ని ప్రారంభించాయి.
 

                                                    హిమాచల్‌లో ఆరు శాతం ఓట్లు కోల్పోయిన బిజెపి

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఆరుశాతం ఓట్లను కోల్పోయింది. 60 స్థానాలున్న ఈ రాష్ట్ర శాసనసభకు 2017లో జరిగిన ఎన్నికల్లో 49.53 శాతం ఓట్లతో 44 స్థానాలను బిజెపి గెలుచుకుంది. గురువారం నాడు ఫలితాలు వెలువడిన తాజా ఎన్నికల్లో 43 శాతం ఓట్లతో 25 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో 42.32 శాతం ఓట్లతో 21 స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ తాజా ఎన్నికల్లో 43.90 శాతం ఓట్లతో 40 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంమీద కాంగ్రెస్‌కు గత ఎన్నికలతో పోలిస్తే 19 స్థానాలు అదనంగా లభించాయి. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారాన్ని మార్చే అలవాటున్న ఈ రాష్ట్రంలో ఈ సారి రెండవసారి కూడా తామే గెలుస్తామని బిజెపి ప్రకటించింది. మోడీ-అమిత్‌షా ధ్వయం స్వయంగా ప్రచారంలోకి దిగి డబుల్‌ ఇంజన్‌ నినాదాన్ని ఇచ్చారు. మరోవైపు సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మృతి చెందడంతో కాంగ్రెస్‌ పార్టీని నాయకత్వ సమస్య వెంటాడింది. అయినా, ఒక వ్యూహం ప్రకారం ప్రచారంచేయడంతో పాటు, స్థానిక అంశాలను, సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి హామీ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ విజయధుంధుభి మోగించింది. భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ ఇక్కడ ప్రచారానికి రాకపోవడంతో ప్రియాంకగాంధీ ముమ్మరంగా పర్యటించారు. ఇక్కడ తొలిసారి పోటీ చేసిన ఆప్‌ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.
 

                                                               గుజరాత్‌లో ఆప్‌తో బిజెపికి లబ్ధి !

గుజరాత్‌లో ముందునుండి ఊహించినట్లుగానే బిజెపి గెలుపొందింది. నరేంద్రమోడీ, అమిత్‌షాలు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడంతో పాటు, మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక వ్యూహం ప్రకారం నిర్వహించిన ప్రచారం ఆ పార్టీకి కలిసివచ్చింది. ఆప్‌,ఎంఐఎంలు పోటీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి పనికి వచ్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరగగా బిజెపికి 156 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌ 17 స్థానాలకు పరిమితం అయింది. ఆప్‌ ఐదు స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికలతో పోలిస్తే బిజెపికి 57 స్థానాలు పెరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ 60 స్థానాలను కోల్పోయింది. కాంగ్రెస్‌కు 15.67 శాతం ఓట్లు తగ్గగా, బిజెపికి 3.06 శాతం ఓట్లు పెరిగాయి.. సౌరాష్ట్ర-కచ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పూర్తిగా పతనమయ్యింది. ఆప్‌ భారీగా ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్‌ తన సీట్లు, ఓట్లను కోల్పోయింది. 1950 నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఆ పార్టీ ఓటమి చెందింది.సూరత్‌, తాపి, భరూచ్‌ జిల్లాల్లోని 27 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలను బిజెపి గెలుచుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో కాంగ్రెస్‌ నేత రఘు శర్మ గుజరాత్‌ ఎఐసిసి ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు.
 

                                                                       ఉప ఎన్నికల్లో ఇలా...

దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపక్షాలు గెలిచాయి. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభను సమాజ్‌వాదీ పార్టీ కైవసం చేసుకోగా, రెండు అసెంబ్లీ స్థానాలకు ఆర్‌ఎల్‌డి, బిజెపి చెరొక్కటి సొంతం చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలవగా, ఒరిస్సాలో బిజెడి గెలిచింది. బీహార్‌లో బిజెపి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములయం సింగ్‌ యాదవ్‌ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆయన కోడలు, అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ 2,88,461 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. బిజెపి అభ్యర్థి రఘురాజ్‌ సింగ్‌ షాక్యా (3,29,659)పై ఎస్‌పి అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ (6,18,120) ఘన విజయం సాధించారు. ఖతౌలీ అసెంబ్లీ స్థానంలో ఆర్‌ఎల్‌డి అభ్యర్థి మధన్‌ భయ్య (97,139), బిజెపి అభ్యర్థి రాజ్‌కుమారి(74,996)పై గెలుపొందారు. రాంపూర్‌లో బిజెపి అభ్యర్థి ఆకాష్‌ సక్సేనా (81,432), ఎస్‌పి అభ్యర్థి అసిం రాజా(47,293)పై గెలిపొందారు. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సావిత్రి మనోజ్‌ మాండవి (65,479) 21,171 ఓట్ల మెజార్టీతో బిజెపి అభ్యర్థి బ్రహ్మానంద నేతమ్‌ (44,308)పై ఘన విజయం సాధించారు. రాజస్థాన్‌లోని సర్దర్శహర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ శర్మ (91,357), బిజెపి అభ్యర్థి అశోక్‌ కుమార్‌ (64,505)పై ఘన విజయం సాధించారు. ఒరిస్సాలోని పదంపూర్‌లో బిజెడి అభ్యర్థి బర్షా సింగ్‌ బరిహా (1,20,807), బిజెపి అభ్యర్థి ప్రదీప్‌ పురోహిత్‌ (78,128)పై ఘన విజయం సాధించారు. బీహార్‌లోని కుర్హానీ అసెంబ్లీ స్థానంలో జెడియు అభ్యర్థి మనోజ్‌ సింగ్‌ (73,073)పై బిజెపి అభ్యర్థి కేదార్‌ ప్రసాద్‌ గుప్తా (76,722) విజయం సాధించారు.
 

                                                                      జాతీయ పార్టీగా ఆప్‌

గుజరాత్‌ ఫలితాల తరువాత ఆప్‌ 'జాతీయ పార్టీ'గా అవతరించింది. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌, గోవాలో రెండు స్థానాలను గెలుచుకుంది. 6.77 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు గుజరాత్‌లో ఐదు స్థానాలను గెలుచుకోగా, దాదాపు 13 శాతం ఓట్లను పొందింది. హిమాచల్‌లో 1.10 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం కంటే ఎక్కువగా ఉండాలనేది ఒక నియమం. దాని ప్రకారం ఇప్పుడు ఆప్‌ జాతీయ పార్టీగా గుర్తింపు పొందనుంది. దేశంలో ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్‌, టిఎంసి, సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, బిఎస్‌పి, ఎన్‌పిపి జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఆప్‌ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తొమ్మిదో పార్టీ అవుతుంది.

011