
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజెపి, వైసిపిలను ఓడించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ పిలుపునిచ్చారు. సీపీఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా సాగింది. తొలుత సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చేరుకుంది. యాత్ర బృంద సభ్యులకు సిపిఎం నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పటేల్ సెంటర్లో సభ నిర్వహించారు. అనంతరం యాత్ర ఆత్మకూరుకు చేరుకుంది. చక్రం హోటల్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు అధికారం కోసం ఆరాటం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ప్రజా సమస్యల మీదకు దృష్టి మళ్లించడానికే ఈ బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. నవంబర్ 15న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించి ప్రజా ప్రణాళికను విడుదల చేస్తున్నామని, దానిని ప్రజలందరూ బలపరచాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వర రావు, భాస్కరయ్య, రమాదేవి, నాగరాణి పాల్గొన్నారు.